అంకిత భావంతో పని చేస్తూ అందరితో ప్రశంసలు అందుకుంటారు కొంతమంది. ఝార్ఖండ్‌లో ఏఎన్ఎమ్గా(ప్రభుత్వ నర్సు)గా విధులు నిర్వర్తించే మానతీ కుమారి కూడా అలాంటి వారిలో ఒకరు. లాతేహార్ జిల్లా మహువాడాండ్ బ్లాక్‌లో విధులు నిర్వర్తించే ఆమె.. తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
అసలింతకీ ఆమె ఏం చేశారంటే..
మానతీ కుమారికి మహువాడాండ్ బ్లాక్‌లోని ఓ గ్రామంలో కొవిడ్ టీకాలు వేసే బాధ్యతలు అప్పగించారు ఆమెపై అధికారులు. అయితే.. ఆ గ్రామానికి ఓ దారంటూ లేదు. ఎవరైనా సరే ఆ ఊరికి వెళ్లాలంటే.. ఓ నది దాటి వెళ్లాల్సిందే. ఏడాది వయసు ఉన్నపాపకు తల్లి అయిన ఆమె.. ఆ నది దాటి వెళ్లేందుకు ఏ మాత్రం సంకోచించలేదు. ఆ ఊరి ప్రజలకు టీకాలు వేయటమే తన ప్రధాన బాధ్యతగా భావించారు.
మహువాడాండ్ కేంద్రంలో హాజరు వేసుకున్న అనంతరం.. ప్రతిరోజు ఉదయం ఆ గ్రామంలో టీకా పంపిణీ చేసేందుకు ఆమె బయలు దేరేవారు. వ్యాక్సిన్ల పెట్టెను భుజాన మోస్తూ, తన పాపను మరో భుజానికెత్తుకుని నది దాటుతూ ఆమె వెళ్లేవారు. ఆ గ్రామస్థులంతా తనను అలా నది దాటడం ప్రమాదకరమని హెచ్చరించినా ఆమె భయపడకుండా ప్రతిరోజు వచ్చేవారు. వర్షాలు కురుస్తున్న సమయంలో.. నది ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నప్పటికీ.. ఆమె ఈ సాహసం చేస్తూ ముందుకు వెళ్లారు.