దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు తరహా ఘటనే ఝార్ఖండ్‌లోని జంషెద్‌పుర్‌లో తాజాగా వెలుగు చూసింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా నరికి చంపాడు ఓ భర్త. అంతేకాకుండా అతడి శరీర భాగాలను సంచుల్లో కట్టి వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు. ఈ ఘాతుకానికి తన భార్య కూడా సహకరించడం గమనార్హం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఝార్ఖండ్‌లోని జంషెద్‌పుర్ సోనారీ ప్రాంతానికి చెందిన ఖుష్బూ సాగర్, కమలాకాంత్ సాగర్ దంపతులు. ఒడిశా రాయరంగ్పుర్ ప్రాంతానికి చెందిన విక్కీ అలియాస్ దమృధర్ మహంతికి ఖుష్బూ సాగర్‌తో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఖుష్బూ సాగర్ భర్త ఇంట్లో లేని సమయంలో విక్కీ తరచూ ఆమె ఇంటికి వచ్చేవాడు.
ఇదిలా ఉండగా ఈనెల 13 నుంచి తన భర్త విక్కీ కనిపించడం లేదంటూ అతడి భార్య ఇనుశ్రీ మహంతి రాయరంగ్పుర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఎఫ్ఐఆర్ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. నిందితులను పట్టుకునేందుకు జంషెద్‌పుర్ డీఎస్పీ స్వర్ణలత మింజ్ నేతృత్వంలో ఓ బృందం ఏర్పాటైంది. విచారణ ప్రారంభించిన పోలీసులు విక్కీకి ఖుష్బూ సాగర్‌తో వివాహేతరం సంబంధం ఉందని గుర్తించారు. ఈ కోణంలో సోనారీ పోలీసుల సహాయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఈ కేసులో ఖుష్బూ సాగర్ సహా భర్త కమలాకాంత్ సాగర్‌ను అనుమానితులుగా భావించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో విక్కీని హత్య చేసింది తామే అని దంపతులు నేరాన్ని అంగీకరించారు. అతడిని హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఒక్కో సంచిలో విక్కీ తల, మొండెం, కాళ్లను వేసి మూడు వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లుగా వారు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. ఫోరెన్సిక్ విభాగం సహకారంతో ఈ శరీర భాగాల సంచులను తెరిచారు పోలీసులు. కాగా, హతుడు విక్కీ వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. ఇతడు ఇంతకుముందు వ్యభిచారం ఆరోపణలతో జైలులో ఉండి ఇటీవలే విడుదలయ్యాడు.
కుక్కల ప్రతాపానికి ఏడేళ్ల చిన్నారి బలి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా రుస్తాంపూర్ ఖాస్ గ్రామంలో దారుణం జరిగింది. కుక్కల దాడిలో ఏడేళ్ల సవేంద్ర అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పొలంలో పని చేస్తున్న తన తండ్రికి టీ తీసుకెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా కుక్కల గుంపు బాలికపై దాడి చేసింది. బాలిక అరుపులు విన్న స్థానికులు అక్కడకు చేరుకొని శునకాలను తరిమేశారు. అనంతరం చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. కాగా, చనిపోయిన పాప 2వ తరగతి చదువుతుంది. అయితే ఈ ప్రాంతంలో ప్రస్తుతం 50 వేల వరకు వీధికుక్కలు తిరుగుతున్నాయని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.