Jharkhand Crisis : ఝార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రం రాజకీయ సంక్షోభం నడుమ ఊగిసలాడుతోంది. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు భాజపా ప్రయత్నిస్తోందని అధికార యూపీఏ ఆరోపిస్తోంది. అందుకే తమ ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గఢ్‌కు తరలించింది.
ఈ మేరకు ఎమ్మెల్యేలతో రెండు బస్సులు తొలుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసం నుంచి రాంచీ ఎయిర్‌పోర్ట్‌కు బయర్దేరాయి. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రాయ్‌పుర్‌కు చేరుకున్నాయి. అక్కడ మేఫెయిర్ రిసార్ట్‌లో ఎమ్మెల్యేలు బస చేయనున్నారు. ఎమ్మెల్యేలను తరలించిన ఒక బస్సులో సోరెన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన సీఎం మాత్రం.. ఒకవేళ తాను ఎమ్యెల్యేలతో వెళ్తే చెబుతానని అన్నారు.
భాజపాయేతర ప్రభుత్వం అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని ఓ రిసార్ట్‌కు తమను తరలించే అవకాశముందని అంతకుముందు ఝార్ఖండ్‌కు చెందిన ఓ కాంగ్రెస్ శాసనసభ్యుడు చెప్పారు. ఎమ్మెల్యేల కోసం ఓ విమానం బుక్ అయిందని విమానాశ్రయ వర్గాలు కూడా వెల్లడించాయి.
మహారాష్ట్ర తరహాలో సంకీర్ణ కూటమిలోని ఎమ్మెల్యేలను ఆకర్షించి, ప్రభుత్వాన్ని పడగొట్టే యోచనలో భాజపా ఉందని అధికార పక్షం నమ్ముతోంది.
81 మంది సభ్యులున్న ఝార్ఖండ్ అసెంబ్లీలో సోరెన్ సర్కారుకు 49 మంది సంఖ్యాబలం ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో 30 మంది ఎమ్మెల్యేలతో ఝార్ఖండ్ ముక్తి మోర్చా అతిపెద్ద పార్టీగా ఉండగా.. కాంగ్రెస్‌కు 18 మంది, ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. భాజపాకు 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ సోరెన్‌పై అనర్హత వేటు పడితే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే మధ్యంతర ఎన్నికలు పెట్టాలని భాజపా నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సంకీర్ణ ప్రభుత్వం ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది. అందుకే వారిని సురక్షిత ప్రాంతంలో ఉంచాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.