Congress MLA Jharkhand: ఝార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెద్ద మొత్తంలో నగదుతో బంగాల్‌లోని హావ్‌డాలో పోలీసులకు పట్టుబడ్డారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన రెండు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఎమ్మెల్యేలను ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కచ్చప్, నమన్ బిక్సాల్ కొంగరిలుగా గుర్తించారు. వీరు ఒక ఎస్‌యూవీ వాహనంలో బంగాల్‌లోని రాణిహటి వద్ద జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
"ఒక నల్ల కారులో పెద్ద మొత్తంలో డబ్బు రవాణా అవుతున్నట్లు మాకు సమాచారం అందింది. దీంతో వాహనాల తనిఖీ మొదలుపెట్టాం. ఇందులో భాగంగా ఝార్ఖండ్ ఎమ్మెల్యేల ఎస్‌యూవీని పరిశీలించినప్పుడు నగదు బయటపడింది. ఈ సొమ్మును లెక్కించడానికి యంత్రాలను తెప్పించాం. నగదు గురించి ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాం" అని హావ్‌డా ఎస్పీ (గ్రామీణ) స్వాతి భంగాలియా పేర్కొన్నారు. వాహనంలో ప్రజాప్రతినిధులతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని చెప్పారు. మరోవైపు జేఎంఎం నేతృత్వంలోని ఝార్ఖండ్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బేరసారాలు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ నగదు లభ్యమైందని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది.