తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆపరేషన్​ ఝార్ఖండ్​: 'రూ.10 కోట్లు, మంత్రి పదవి.. అసోం సీఎంతో మీటింగ్!'

పెద్ద ఎత్తున నగదుతో ప్రయాణిస్తూ పోలీసులకు చిక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల కేసు సీఐడీకి బదిలీ అయింది. కాగా, ముగ్గురు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందని, పట్టుబడిన శాసనసభ్యుల ద్వారా మిగతా ఎమ్మెల్యేలకు డబ్బు, మంత్రిపదవులను ఆశజూపిందని ఆరోపించారు.

jharkhand-congress-mlas-cash
jharkhand-congress-mlas-cash

By

Published : Jul 31, 2022, 4:22 PM IST

Jharkhand Congress MLAs cash: భారీగా నోట్ల కట్టలతో పట్టుబడిన ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కేసును బంగాల్ సీఐడీ విచారించనుంది. ఈ కేసును సీఐడీకి అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. కారులో నగదుతో దొరికిన వీరిని హావ్​డా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదును స్వాధీనం చేసుకొని ప్రాథమిక విచారణ అనంతరం వీరిని అరెస్ట్ చేశారు. 'నగదు తరలిస్తున్న వాహనంలో ముగ్గురు ప్రజాప్రతినిధులతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. నగదు మొత్తం రూ.49 లక్షలు ఉంది. ఈ డబ్బు ఎక్కడిది? ఎందుకు తీసుకొచ్చారనే విషయం వారు స్పష్టంగా చెప్పలేదు. కారు కొనేందుకని, ఆదివాసీలకు పంచేందుకు చీరలు కొంటామని చెప్పారు. ఈ సమాధానాలు సహేతుకంగా అనిపించలేదు. అందుకే వారిని అరెస్టు చేశాం. హావ్​డా రూరల్ పోలీసుల నుంచి ఈ కేసు బంగాల్ సీఐడీకి బదిలీ అయింది' అని సీనియర్ పోలీసు అధికారి వివరించారు.

కాగా, ముగ్గురు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ శాసనసభ్యుడు కుమార్ జైమంగళ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఝార్ఖండ్ సర్కారును కూల్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 'ఎమ్మెల్యేలకు రూ.10 కోట్ల చొప్పున భాజపా ఇవ్వజూపింది. నగదుతో పట్టుబడ్డ ఎమ్మెల్యేలు.. పార్టీలోని ఇతర ఎమ్మెల్యేలకు డబ్బును ఎరగా వేశారు. మంత్రి పదవులు, రూ.10 కోట్లు ఇస్తామని బేరమాడారు. రాజేశ్ కచ్చప్, నమన్ బిక్సల్ కొంగారి నాకు డబ్బు ఇస్తానని చెప్పి కోల్​కతాకు రమ్మన్నారు. అక్కడి నుంచి గువాహటికి వెళ్దామని చెప్పారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో మీటింగ్ ఉందన్నారు' అని జైమంగళ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

స్పందించిన హిమంత..
అయితే, ఈ కేసులో తన పేరు ప్రచారం కావడాన్ని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఖండించారు. 'కాంగ్రెస్​ అధిష్ఠానంలోని నేతలతోనూ నేను టచ్​లో ఉంటా. మేం రాజకీయాలు మాట్లాడుకోం. 22ఏళ్లు ఓ పార్టీలో ఉన్నా. సాధారణంగానే మేం సంప్రదింపులు సాగిస్తాం. ఈ విషయానికి ఎందుకు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారో నాకు తెలియదు' అని హిమంత పేర్కొన్నారు.

ఇదీ జరిగింది..:
శనివారం సాయంత్రం ఝార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పెద్ద మొత్తంలో నగదుతో బంగాల్​లోని హావ్‌డాలో పోలీసులకు చిక్కారు. ఈ ఎమ్మెల్యేలను ఇర్ఫాన్‌ అన్సారీ, రాజేశ్‌ కచ్చప్‌, నమన్‌ బిక్సాల్‌ కొంగరిగా గుర్తించారు. వీరు ఒక ఎస్‌యూవీ వాహనంలో బంగాల్‌లోని రాణిహటి వద్ద జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

ఈ ఘటన రెండు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఎమ్మెల్యేల వద్ద పట్టుబడ్డ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో కాంగ్రెస్‌ వివరణ ఇవ్వాలని ఝార్ఖండ్‌లో అధికార జేఎంఎం, విపక్ష భాజపా డిమాండ్‌ చేశాయి. రాష్ట్రంలోని హేమంత్‌ సొరెన్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి భాజపా ప్రయత్నిస్తోందని ఈ ఘటన స్పష్టంచేస్తున్నట్లు కాంగ్రెస్‌ ఆరోపించింది. ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని, ప్రభుత్వం స్థిరంగానే ఉందని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details