తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఝార్ఖండ్​ సీఎంకు బిగ్​ షాక్​, అనర్హత వేటుకు ఈసీ సిఫార్సు, నెక్ట్స్ సీఎం ఎవరంటే - జార్ఖండ్ తదుపరి సీఎం

CM Hemant Soren disqualified
ఝార్ఖండ్​ సీఎంకు బిగ్​ షాక్​

By

Published : Aug 25, 2022, 12:00 PM IST

Updated : Aug 25, 2022, 7:08 PM IST

11:49 August 25

ఝార్ఖండ్​ సీఎంకు బిగ్​ షాక్​, అనర్హత వేటుకు ఈసీ సిఫార్సు, నెక్ట్స్ సీఎం ఎవరంటే

ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. గవర్నర్​ రమేశ్​ బైస్​కు ఈసీ నివేదిక సమర్పించినట్లు రాజ్​భవన్ వర్గాలు వెల్లడించాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడినందున ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించినట్లు తెలుస్తోంది. సీల్డు కవరులో నివేదికను రాజ్​భవన్​కు పంపినట్లు సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి.

ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్.. మైనింగ్​ లీజును తనకు తానే కేటాయించుకున్నారని, ఇది అధికార దుర్వినియోగమేనని ఆరోపిస్తూ భాజపా ఫిర్యాదు చేసింది. దీనిపై ఈసీ అభిప్రాయం కోరారు గవర్నర్. ఎన్నికల సంఘం నివేదిక ఆధారంగా అతి త్వరలోనే ముఖ్యమంత్రిపై గవర్నర్​ చర్యలు తీసుకునే అవకాశముంది. రెండు రోజుల పాటు దిల్లీ ఎయిమ్స్​లో చికిత్స తీసుకున్న ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్.. గురువారమే రాంచీలో ల్యాండ్ అయ్యారు. ప్రస్తుత పరిణామాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

అయితే, ఎన్నికల సంఘం తన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్‌కు సిఫార్సు చేసిందనే అంశంపై ఎలాంటి సమాచారం లేదని ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్ చెప్పుకొచ్చారు. భాజపా నేతలే ఎన్నికల సంఘం నివేదిక పేరిట తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇదే సమయంలో కేంద్రంలోని భాజపా సర్కారు రాజ్యాంగ సంస్థలను విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తోందని ఆయన విమర్శించారు. భాజపా ప్రధాన కార్యాలయం కేంద్రంగా ఇదంతా జరుగుతోందని, ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మారాయని హేమంత్‌ సోరెన్ ఆవేదన వ్యక్తం చేశారు.

నెక్ట్స్ సీఎం ఎవరంటే?
హేమంత్ భవిష్యత్ ప్రశ్నార్థకంలో పడిన నేపథ్యంలో.. తదుపరి పరిణామాలేంటన్న విషయంపై రాష్ట్రంలో చర్చ మొదలైంది. తర్వాతి ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై రాజకీయ పండితులు విశ్లేషణలు వినిపిస్తున్నారు. గతంలో బిహార్​లో జరిగిన మాదిరిగానే.. హేమంత్ తన భార్య కల్పనా సొరెన్​కు సీఎం పదవి అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు. 1996లో అప్పటి బిహార్ సీఎంగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంలో చిక్కుకున్నారు. ఈ ఆరోపణ మధ్యే కొన్ని నెలలు ప్రభుత్వాన్ని నడిపించారు. ఆ కేసులో సీబీఐ ఛార్జ్​షీట్ నమోదు చేయగానే.. సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ తన భార్య రబ్రీ దేవి పేరును ముఖ్యమంత్రి పదవికి తెరపైకి తెచ్చారు. ఆ రాష్ట్రం నుంచి విడిపోయి ఝార్ఖండ్ ఏర్పడింది. ఇప్పుడు అలాంటి పరిస్థితే హేమంత్​కు ఎదురైన నేపథ్యంలో లాలూ ఐడియాను అమలు చేసే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Last Updated : Aug 25, 2022, 7:08 PM IST

ABOUT THE AUTHOR

...view details