ఝార్ఖండ్లో రిజర్వేషన్లను 77 శాతానికి పెంచుతూ శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో ఓ బిల్లును ఆమోదించారు. 2001 నాటి రిజర్వేషన్ చట్టాన్ని ఈమేరకు సవరించారు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రస్తుతం ఉన్న 60 శాత రిజర్వేషన్‌లను మరో 17 శాతం పెంచారు. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లు ఈ బిల్లులో పేర్కొన్నారు. అయితే ఈ మార్పును షెడ్యూల్‌లో చేర్చిన తర్వాత అమలులోకి వస్తుందని తెలిపారు.
ప్రస్తుతం ఝార్ఖండ్లో ఎస్టీలకు 26శాతం, ఎస్సీలకు 10శాతం రిజర్వేషన్ ఉంది. ఓబీసీల కోటా 14శాతంగా ఉండగా.. పెంచుతామని 2019 ఎన్నికల సమయంలో అన్ని ప్రధాన పార్టీలు హామీ ఇచ్చాయి. ఇప్పుడు హేమంత్ సోరెన్ తెచ్చిన బిల్లుతో ఎస్సీలకు 12 శాతం, ఎస్టీలకు 28 శాతం, ఈబీసీలకు 15 శాతం, ఓబీసీలకు 12 శాతం రిజర్వేషన్ ఉండనుంది.