భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున జమ్ములో దాడులకు పాల్పడేందుకు పథక రచన చేసిన ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు అధికారులు. నలుగురు ఉగ్రవాదులు, వారి అనుచరులను అరెస్టు చేశారు. ఓ వాహనంలో ఐఈడీని అమర్చాలని వీరు పన్నాగం పన్నినట్లు పోలీసులు తెలిపారు.
ఉగ్రవాదులంతా జైషే మహమ్మద్ సంస్థకు చెందినవారని పోలీసు ప్రతినిధి తెలిపారు. యూపీకి చెందిన ఓ వ్యక్తి వీరితో ఉన్నాడని చెప్పారు.
"డ్రోన్లు సరిహద్దు దాడి విడిచిపెట్టి వెళ్లిన ఆయుధాలను సేకరించేందుకు వీరు ప్రణాళికలు రచించుకున్నారు. కశ్మీర్ లోయలో క్రియాశీలంగా ఉన్న జైషే ఉగ్రవాదులకు వీటిని సరఫరా చేయాలనుకున్నారు. ఆగస్టు 15కు ముందు ఐఈడీ అమర్చిన ఓ వాహనాన్ని జమ్ములో ఉంచాలని అనుకున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాలనూ లక్ష్యంగా చేసుకున్నారు."
-పోలీసు ప్రతినిధి
తొలుత జైషేకు చెందిన ముంతాజిర్ మంజూర్ అలియాస్ సైఫుల్లాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతని దగ్గర నుంచి ఓ పిస్తోల్, మేగజైన్, ఎనిమిది బుల్లెట్లు, రెండు చైనా హ్యాండ్ గ్రెనేడ్లు సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఆయుధాలు సరఫరా చేసేందుకు ఉపయోగిస్తున్న ట్రక్కును సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.
అయోధ్యపై నిఘా!
అమృత్‌సర్‌లో డ్రోన్లు వదిలిపెట్టిన ఆయుధాలను సేకరించాలని పాకిస్థాన్‌లోని జైషే కమాండర్ తనకు సూచించినట్లు సోనూ ఖాన్ చెప్పాడని అధికారులు తెలిపారు. 'పానీపత్ ఆయిల్ రిఫైనరీపై నిఘా పెట్టాలని ఆదేశించారని, వీటిని పాటించి పాకిస్థాన్‌కు వీడియోలు కూడా పంపించినట్లు ఉగ్రవాది చెప్పాడు. అనంతరం అయోధ్య రామ జన్మభూమి ప్రాంతంలోనూ రెక్కీ నిర్వహించాలని ఆదేశాలు అందినట్లు తెలిపాడు. కానీ, అయోధ్యకు వెళ్లేలోపే అరెస్టయ్యాడు' అని పోలీసు అధికారి వివరించారు.
'జమ్ములో ఆశ్రయం సంపాదించాలని మరో ఉగ్రవాది తౌసీఫ్ అహ్మద్ షా అలియాస్ షౌకత్‌కు పాక్‌లోని జైషే కమాండర్లు ఆదేశించారు. జమ్ములో ఐఈడీ పేలుడు కోసం సెకండ్ హ్యాండ్ బైక్‌ను సేకరించాలని సూచించారు. ఐఈడీని డ్రోన్ల ద్వారా పంపిస్తా'మని చెప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. అంతకుముందే షా అరెస్టయ్యాడని వెల్లడించారు. ఈ ఉగ్రకుట్రలపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
ఇదీ చదవండి:భద్రతా వలయంలో ఎర్రకోట- రంగంలోకి షార్ప్ షూటర్లు