JEE Main Results 2023 : దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ 2023 సెషన్-2 ఫలితాలు వచ్చేశాయి. జనవరిలో సెషన్-1 పరీక్షలు జరగ్గా.. ఈ నెల 6 నుంచి 15 వరకు జరిగిన రెండో విడత పరీక్షల ఫలితాలను ఎన్‌టీఏ ఈ ఉదయం విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఫలితాల్లో సత్తా చాటారు.
JEE Main Results 2023 Release : హైదరాబాద్‌కు చెందిన సింగారపు వెంకట్ కౌండిన్య అనే విద్యార్థి 300కు 300 మార్కులు సాధించి మొదటి ర్యాంకు సాధించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు విద్యార్థి పి.లోహిత్ ఆదిత్య సాయి రెండో ర్యాంకు కైవసం చేసుకున్నారు. రాష్ట్రానికి చెందిన సాయి దుర్గారెడ్డి అనే మరో విద్యార్థి ఆరో ర్యాంకు సాధించగా.. ఏపీలోని అమలాపురానికి చెందిన విద్యార్థి కె.సాయినాథ్ శ్రీమంతకు పదో ర్యాంకు వచ్చింది. విద్యార్థులు తమ ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
ఏప్రిల్ 6 నుంచి 15 వరకు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన ఉత్తమ స్కోరు (పరీక్షలు రెండుసార్లు రాసి ఉంటే)ను పరిగణనలోకి తీసుకొని ఎన్‌టీఏ ర్యాంకులు ప్రకటించింది. తొలి విడతలో 8.24 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. రెండోవిడతలో దాదాపు 9 లక్షల మంది వరకు పరీక్షలకు హాజరైనట్టు అంచనా.
ఈ నెల 30 నుంచే అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్లు మొదలు.. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. మే 7 వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా.. అప్లికేషన్ ఫీజు 8 వరకు చెల్లించే అవకాశం కల్పించారు. పరీక్ష జూన్ 4న జరగనుండగా.. మే 29 నుంచి జూన్ 4 వరకు అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 ఉంటుంది.
ఇవీ చూడండి..
'ఐదేళ్లుగా ఫోన్కు దూరం.. అందుకే 100% స్కోర్!'.. సక్సెస్ సీక్రెట్ చెప్పిన జేఈఈ టాపర్
జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు విడుదల.. రిజల్ట్ చెక్ చేసుకోండిలా..