తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నితీశ్​ ప్లాన్​కు భాజపా కౌంటర్.. ఆ ఎమ్మెల్యేలపై వేటు!.. మరి ప్రభుత్వం ఏర్పాటు ఎలా? - భాజపా జేడీయూ బిహార్

JDU BJP alliance breakup: బిహార్​లో జేడీయూ ప్రణాళికలకు భాజపా కౌంటర్ వ్యూహాలు రచిస్తోంది. ఆర్జేడీతో కలిసి జేడీయూ ప్రభుత్వ ఏర్పాటుకు యత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో.. కమలదళం అలర్ట్ అయింది. ఆర్జేడీ ఎమ్మెల్యేలపై వేటు పడేలా పావులు కదుపుతోంది.

JDU BJP alliance breakup
JDU BJP alliance breakup

By

Published : Aug 9, 2022, 12:04 PM IST

Bihar politics: బిహార్​లో భాజపాకు దూరమవుతున్న జేడీయూకు చెక్ పెట్టేలా కమలదళం వ్యూహాలు రచిస్తోంది. మహాగట్​బంధన్​తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు యత్నిస్తున్న నితీశ్ ఆశలపై నీళ్లు చల్లేందుకు భాజపా ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు బిహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ సిన్హా.. ఆర్జేడీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

ఎందుకు వేటు?
2021 మార్చి 23న అసెంబ్లీలో 'పోలీసు బిల్లు'పై జరిగిన చర్చ సందర్భంగా ఆర్జేడీ నేతలు ఆందోళన చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయంలోనే స్పీకర్ చర్యలు తీసుకుంటున్నారు. 18 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం!

స్పీకర్ విజయ్ సిన్హాకు ఆదివారం కరోనా పాజిటివ్​గా తేలింది. ఒక్కరోజులోనే ఆయనకు కొవిడ్ నెగెటివ్​ వచ్చింది. అంతకుముందే, ఆగమేఘాల మీద ఆయన క్రమశిక్షణా కమిటీ సమావేశానికి పిలుపునిచ్చారు. రామ్​నారాయన్ మండల్ అధ్యక్షతన ఆదివారం జరిగిన భేటీలో 18 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేల భవితవ్యంపై చర్చలు జరిపారు. ఎన్​డీఏ నుంచి వైదొలిగేందుకు నితీశ్ ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో స్పీకర్.. వేగంగా చర్యలు తీసుకుంటుండటం గమనార్హం. ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

అసెంబ్లీలో లెక్కలు ఇలా..
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లపై చర్చ మొదలైంది. 18 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినా.. మహాగట్​బంధన్​తో కలిసి నితీశ్ కుమార్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. బిహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం 127 సీట్లతో.. భాజపా, జేడీయూ కూటమి అధికారంలో ఉంది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ ఆర్జేడీకి అసెంబ్లీలో 80 స్థానాలు ఉండగా.. భాజపా 77, జేడీయూ 45, కాంగ్రెస్ 19 సీట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భాజపాతో తెగదెంపులు చేసుకున్నా.. ఆర్జేడీ, కాంగ్రెస్​తో కలిసి నితీశ్ కుమార్ సులభంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ 18 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలపై వేటు పడ్డా.. నితీశ్ కుమార్​కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని విశ్లేషకులు చెబుతున్నారు.

నితీశ్ సొంత పార్టీ శాసనసభ్యులతో సమావేశమైన నేపథ్యంలో.. భాజపా సైతం సమాలోచనల్లో పడింది. ఆ పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి భికుభాయి దల్సానియా, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్.. ఉప ముఖ్యమంత్రి తార్​కిశోర్ ప్రసాద్ నివాసంలో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిణామాలపై నేతలు చర్చలు జరుపుతున్నారు. తదుపరి తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చిస్తున్నారు.

ఏం జరగవచ్చు?
BJP JDU Gathbandhan: ఎన్​డీఏ నుంచి జేడీయూ బయటకు రావడం దాదాపు ఖరారైనట్లే తెలుస్తోంది. బిహార్ గవర్నర్ ఫాగూ చౌహాన్ అపాయింట్​మెంట్ కోరినట్లు జేడీయూ వర్గాలు వెల్లడించాయి. రాజీనామా చేసి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకే నితీశ్ గవర్నర్​ను కలవనున్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details