JDS Joins NDA Alliance Party :కర్ణాటకకు చెందిన జనతా దళ్ సెక్యూలర్(జేడీఎస్).. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో అధికారికంగా చేరింది. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ అనంతరం జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఎన్డీయేలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ తాజా పరిణామంతో కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ మధ్య పొత్తు పొడుపులపై గత కొన్నాళ్లుగా వస్తోన్న వార్తలకు ముగింపు పలికినట్లయింది. కాగా, కర్ణాటకలో ఈ రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపులకు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. రెండు పార్టీల పొత్తు ప్రకటనకు ముందు జరిగిన కీలక భేటీలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా పాల్గొన్నారు.
'మోదీ విజన్ మరింత బలంగా!'
ఈ చేరికతో ప్రధాని నరేంద్ర మోదీ విజన్ మరింత బలోపేతమవుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. అమిత్ షా సమక్షంలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి సమావేశమయ్యారని నడ్డా ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఎన్డీయేతో కలిసి జేడీఎస్ పనిచేసేందుకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. జేడీఎస్‌ను హృదయపూర్వకంగా తమ కూటమిలోకి ఆహ్వానిస్తున్నట్లు నడ్డా పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఎన్డీయేను, ప్రధాని నరేంద్ర మోదీ 'న్యూ ఇండియా, స్ట్రాంగ్ ఇండియా' విజన్‌ను మరింత బలోపేతం చేస్తుందని ఆయన ట్వీట్ చేశారు.
అభివృద్ధి చెందిన భారత్‌పై మోదీజీకి ఉన్న నమ్మకం ఉంచి జేడీ(ఎస్) ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేను భావిస్తున్నానానని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు.