JDS BJP Alliance In Karnataka : కర్ణాటకలో.. భారతీయ జనతా పార్టీ, జేడీఎస్ జట్టు కట్టనున్నాయనే ప్రచారానికి తెరపడింది. కమలం పార్టీతో కలిసి పనిచేయనున్నట్లు జేడీఎస్ అగ్రనేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి ప్రకటించారు. కర్ణాటకలో బీజేపీతో కలిసి ప్రతిపక్షంగా పనిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. బీజేపీతో జట్టు కట్టే విషయంలో.. తుదినిర్ణయం తీసుకునే అధికారం జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడతనకు అప్పగించినట్లు చెప్పారు. ఈ పొత్తు సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఉంటుందా అనే ప్రశ్నకు.. పార్లమెంటు ఎన్నికలకు ఇంకా సమయం ఉందని కుమారస్వామి సమాధానం ఇచ్చారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేతో జేడీఎస్ జట్టు కట్టనుందన్న ప్రచారం మధ్య గురువారం రాత్రి జరిగిన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో జరిగిన చర్చలపై అడిగిన ప్రశ్నకు.. కుమారస్వామి ఈ మేరకు స్పందించారు. కర్ణాటకలో జేడీఎస్, బీజేపీ ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నాయని.. అందుకే కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
BJP JDS Coalition : దేశ ప్రయోజనాల కోసం బీజేపీతో చేతులు కలుపుతున్నామని జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి అన్నారు. శుక్రవారం విధానసౌదలో తన కార్యాలయంలో మాజీ సీఎం బసవరాజ్ బొమ్మైతో కలిసి కుమారస్వామి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీతో జట్టుకట్టడంపై ప్రకటన చేశారు.
Karnataka Election Results : ఈ ఏడాది మే నెలలో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి. కర్ణాటక ఎన్నికల్లో మొత్తం 224 స్థానాలు అసెంబ్లీ స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ 135 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. భారతీయ జనతా పార్టీ 66 సీట్లు, మాజీ ప్రధాని దేవెగౌడ సారథ్యంలోని జేడీఎస్ 19 స్థానాలు గెలుపొందాయి. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల ఫలితాల అనంతరం జేడీఎస్.. బీజేపీతో జట్టుకట్టనుందని వార్తలు వచ్చాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో జేడీఎస్ పనిచేయనుందని ఊహాగానాలు వెలువడ్డాయి. తాజాగా జేడీఎస్ అగ్రనేత, కర్ణాటక మాజీ సీఎం బీజేపీతో జేడీఎస్ దోస్తీపై ప్రకటన చేశారు.
Opposition Meeting In Bengaluru : ఇటీవలే కేంద్రంలోని అధికార NDAని దీటుగా ఎదుర్కొనేందుకు ఏకమైన విపక్షాలు.. బెంగళూరులో సమావేశాన్ని నిర్వహించాయి. తమ కూటమికి ఇండియాగా నామకరణం చేశాయి. ఇండియా అంటే ఇండియన్ నేషనల్ డెవెలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్‌గా పేర్కొన్న నేతలు.. 2024 ఎన్నికల్లో ఇండియా, ఎన్డీఏ మధ్యే జరుగుతాయని తెలిపారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.