జేడీయూకు భారీ షాక్ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్లో ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఆరుగురు భాజపాలో చేరారు. అరుణాచల్ పీపుల్స్ పార్టీ(పీపీఏ)కి చెందిన ఏకైక ఎమ్మెల్యే కూడా అదే బాట పట్టారు.
ఇటీవల రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఒక్కరోజు ముందు ఈ పరిణామం జరగడం గమనార్హం.
ముందే సంకేతాలు
అరుణాచల్ ప్రదేశ్ జేడీయూలో తిరుగుబాటు కొద్ది రోజుల క్రితమే మొదలైంది. పార్టీ సీనియర్ నేతలకు చెప్పకుండా ఆరుగురు ఎమ్మెల్యేలు కలిసి తాలేమ్ తబోను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆగ్రహించిన అధిష్ఠానం... ముగ్గురికి నవంబర్ 26నే షోకాజ్ నోటీసులు ఇచ్చి, సస్పెండ్ చేసింది.