Kerala Sahitya Akademi Award Winner Akhil : కేరళకు చెందిన ఓ జేసీబీ డ్రైవర్.. ప్రతిష్ఠాత్మక సాహిత్య అకాడమీ అవార్డ్‌కు ఎంపికయ్యారు. కేవలం 12వ తరగతి మాత్రమే చదివిన ఆయన్ను.. కేరళ సాహిత్య అకాడమీ పరిధిలోని గీతా హిరణ్య ఎండోమెంట్ అవార్డ్-2022 వరించింది. కుటుంబం కోసం చదువును మధ్యలోనే మానేసిన ఆయన.. సాహిత్యంపై మమకారంతో ఈ స్థాయికి ఎదిగారు. పొట్టకూటి కోసం ఎన్నో పనులు చేస్తూ.. వీలు చిక్కినప్పుడుల్లా తన కలానికి పని చెప్పేవారు అఖిల్. ప్రస్తుతం కేరళ ప్రతిష్ఠాత్మక అవార్డ్‌ను సొంతం చేసుకుని.. జీవిత అనుభవాల నుంచి గొప్ప పుస్తకాలు పుట్టుకొస్తాయని నిరూపించారు. ఆయనే కన్నూరు ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల అఖిల్.
ఇటీవలె కేరళ సాహిత్య అకాడమీ పలు విభాగాల్లో ఆవార్డులను ప్రకటించింది. ఈ క్రమంలోనే గీతా హిరణ్య ఎండోమెంట్ అవార్డ్-2022కు అఖిల్‌ను ఎంపిక చేసింది అకాడమీ. 2020లో ప్రచురితం అయిన చిన్న కథల సంకలనం 'నీలచడయాన్'కు ఈ అవార్డ్ వచ్చింది. కుటుంబ ఆర్థిక సమస్యలతో టీనేజ్‌లో ఉన్నప్పుడు రోజూ న్యూస్ పేపర్ వేసేవారు అఖిల్. రాత్రి సమయాల్లో ఇసుక తవ్వేందుకు వెళ్లి.. అర్థరాత్రి వరకు అక్కడే పని చేసేవారు. ఆ తరువాత జేసీబీ ఆపరేటర్‌గాను అఖిల్ పనిచేశారు. ఇటువంటి క్లిష్ట సమయాల్లోనూ.. వీలు చిక్కినప్పుడల్లా రచనలు చేస్తుండేవారు అఖిల్. పని చేసే సమయంలో ఒంటరితనాన్ని అధిగమించేందుకు సమాజంలో నుంచి గ్రహించిన విషయాల ఆధారంగా తనలో తాను కథలు ఊహించుకునేవాడినని అఖిల్ వెల్లడించారు. తన జీవితంలో చాలా మందిని కలిశానని.. వారి అనుభవాలను, ఇతర అంశాలను గ్రహించానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ అవార్డ్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపిన అఖిల్.. ఇది తాను అస్సలు ఊహించలేదని చెప్పారు.
"ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న నా కుటుంబం కోసం నేను పని చేయాల్సి వచ్చింది. అందుకే చదువును మధ్యలోనే ఆపేశాను. నా రచనలను పబ్లిష్ చేయడానికి దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఇబ్బంది పడ్డాను. పుస్తక ప్రచురణల కోసం చాలా మంది పబ్లిషర్స్‌ను సంప్రదించాను. నా కథలు వారికి నచ్చినప్పటికీ.. వాటిని పబ్లిష్ చేసేందుకు వారు ముందుకు వచ్చేవారు కాదు."