Chigurupati Jayaram murder case updates: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసుకు సంబంధించి.. హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు నేడు సంచలన తీర్పును వెలువరించింది. జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేశ్ రెడ్డిని దోషిగా తేల్చుతూ, మార్చి 9వ తేదీన శిక్షను ఖరారు చేయనున్నట్లు తెలిపింది. ఇదే కేసులో ఏసీపీ మల్లారెడ్డి, ఇద్దరు సీఐలతో పాటు మొత్తం 11 మందిని నిర్దోషులుగా తేల్చింది.
అప్పట్లో కేసుకు సంబంధించి పలు కీలక విషయాలను దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. అందులో ముఖ్యంగా.. ''2019 జనవరి 31న పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాంను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు.. దోషులు యత్నించారు. ఆ తర్వాత జయరాం మృతదేహాన్ని.. తన స్నేహితులతో కలిసి రాకేశ్ రెడ్డి.. కృష్ణా జిల్లా నందిగామ వద్ద కారులో ఉంచారు. డబ్బు వ్యవహారమే జయరాం హత్యకు ముఖ్య కారణం'' అని పోలీసులు విచారణ చేపట్టి.. 2019 మే నెలలోనే నేరాభియోగపత్రం దాఖలు చేశారు. ఈ అభియోగాలపై దాదాపు నాలుగేళ్లపాటు విచారణ జరిపిన కోర్టు.. నేడు రాకేశ్ రెడ్డిని దోషిగా తేల్చింది. మిగతా వారి ప్రమేయంపై తగిన ఆధారాలు లేనందున 11 మందిని నిర్దోషులుగా నిర్ణయిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది.
అసలు ఏం జరిగిందంటే:పారిశ్రామికవేత్త జయరాం 2019వ సంవత్సరం జనవరి 31వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. రాకేష్ రెడ్డి, తన స్నేహితులతో కలిసి ఆయనను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి.. జయరాం మృతదేహాన్ని విజయవాడలోని నందిగామ రహదారిపై ఒక వాహనంలో వదిలేసి వెళ్లారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి విచారణ అనంతరం కోర్టుకు పంపించారు. దీంతో జయరాం హత్య కేసు నాలుగేళ్లుగా విచారణ సాగుతూనే ఉంది.