తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్- జపాన్ బంధం మరింత దృఢం!.. జీ7 సదస్సుకు మోదీకి ఆహ్వానం

భారత పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిద.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. కీలక అంశాలపై ఇరువురూ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జీ7 సదస్సుకు రావాలని మోదీని కిషిద ఆహ్వానించారు. ఇందుకు మోదీ సుముఖత వ్యక్తం చేశారు.

japan pm visit to india
japan pm visit to india

By

Published : Mar 20, 2023, 2:47 PM IST

భారత్- జపాన్ దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఇరుదేశాల ప్రధానమంత్రులు నిర్ణయించారు. ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతలు నెలకొనడానికి రెండు దేశాల సంబంధాలు కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిద అభిప్రాయపడ్డారు. భారత్, జపాన్ మధ్య బలమైన సంబంధాలు.. రెండు దేశాలకు ప్రయోజనకరమని పేర్కొన్నారు. భారత పర్యటన నిమిత్తం దిల్లీకి చేరుకున్న కిషిదతో మోదీ భేటీ అయ్యారు. ఇరుదేశాల సరిహద్దుల్లో చైనా దూకుడు, రష్యా దురాక్రమణ నేపథ్యంలో ప్రపంచంలో అనిశ్చితి నెలకొన్న వేళ వీరిద్దరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

ప్రస్తుతం జీ7 దేశాల కూటమికి జపాన్ నేతృత్వం వహిస్తున్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. భారత్ ప్రస్తుతం జీ20కి నాయకత్వం వహిస్తోందని అన్నారు. కీలక అంశాలపై పనిచేసి, ప్రపంచ శ్రేయస్సు కోసం పాటుపడేందుకు ఇదే సరైన సమయమని మోదీ అభిప్రాయపడ్డారు. జీ20 కూటమి అధ్యక్ష హోదాలో భారత్ చేపట్టనున్న కీలక కార్యక్రమాల గురించి కిషిదకు వివరించినట్లు మోదీ తెలిపారు. రక్షణ, డిజిటల్ టెక్నాలజీ, వాణిజ్యం, పెట్టుబడులు, వైద్య రంగాల్లో ఇరుదేశాల మధ్య భాగస్వామ్యంపై తాము చర్చించినట్లు మోదీ పేర్కొన్నారు. సెమీ కండక్టర్ల కోసం విశ్వసనీయమైన సప్లై చైన్ ఉండాల్సిన ఆవశ్యకతపై సమాలోచనలు చేసినట్లు తెలిపారు.

కిషిద, మోదీ కరచాలనం
మోదీ, కిషిద చర్చలు

జీ7 ఆహ్వానం
భారత్​తో ఆర్థిక సహకారంలో గణనీయ వృద్ధి కొనసాగుతోందని జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిద పేర్కొన్నారు. ఇది భారత అభివృద్ధికి ఊతమివ్వడమే కాకుండా.. జపాన్​కు అనేక అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. మేలో హిరోషిమాలో జరగనున్న జీ7 శిఖరాగ్ర సదస్సుకు మోదీని తాను ఆహ్వానించానని కిషిద తెలిపారు. ఇందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు.

మోదీతో కిషిద

రాజ్​ఘాట్ సందర్శన..
ఉదయం 8 గంటలకు దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధానికి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం, ఆయన రాజ్​ఘాట్​ను సందర్శించారు. మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించిన ఆయన.. అక్కడి సందర్శకుల నోట్​బుక్​లో సంతకం చేశారు.

రాజ్​ఘాట్​లో కిషిద

బలమైన బంధం!
భారత్- జపాన్ మధ్య అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉంది. ఇరుదేశాలు క్వాడ్​లో సభ్యులుగా ఉన్నాయి. ఇరుదేశాల మధ్య 20.75 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. గతేడాది ప్రధాని మోదీ, కిషిద మూడు సార్లు భేటీ అయ్యారు. 14వ జపాన్-భారత్ వార్షిక సదస్సు కోసం కిషిద దిల్లీకి రాగా.. మోదీ రెండుసార్లు ఆ దేశంలో పర్యటించారు. క్వాడ్ సమిట్​లో పాల్గొనేందుకు మేలో జపాన్ వెళ్లిన మోదీ.. సెప్టెంబర్​లో మాజీ ప్రధాని షింజో అబె అధికారిక అంత్యక్రియల కార్యక్రమానికి సైతం హాజరయ్యారు.

కిషిదతో రాజీవ్ చంద్రశేఖర్​

ABOUT THE AUTHOR

...view details