Japan PM in India: రెండు రోజుల భారత్ పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా.. ప్రధాని నరేంద్ర మోదీతో శనివారం భేటీ అయ్యారు. దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ పరస్పర ప్రయోజనాలే ఎజెండాగా ఇరువురు నేతలు చర్చించుకున్నారు. అనంతరం.. 14వ భారత్- జపాన్ ద్వైపాక్షిక సదస్సులో పాల్గొన్నారు కిషిడా. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆరు ఒప్పందాలు కుదిరాయి. సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, ఇన్ఫర్మేషన్ షేరింగ్ అండ్ కార్పొరేషన్ విభాగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయి.
"భారత్-జపాన్ల మధ్య ఆర్థిక భాగస్వామ్యం వృద్ధి చెందుతోంది. భారత్‌లోని అతిపెద్ద పెట్టుబడిదారుల్లో జపాన్ ఒకటి. హైస్పీడ్ ప్రాజెక్టుపై ఇరు దేశాలు వన్ నేషన్-వన్ ప్రాజెక్ట్ అన్నట్టు కృషి చేస్తున్నాయి. స్థిరత్వం, సురక్షితమైన విద్యుత్ పంపిణీ ప్రాముఖ్యత ఇరు దేశాలకు తెలుసు. ఆర్థిక వృద్ధికి, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఇది ఎంతో అవసరం."
-ప్రధాని నరేంద్ర మోదీ
"ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో జపాన్-భారత్‌ల మధ్య బలమైన భాగస్వామ్యం ఉండటం చాలా ముఖ్యం. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల గురించి చర్చించుకున్నాం. ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం అవసరం. ఇండో-పసిఫిక్పైన ఇరు దేశాలు మరింత కృషి చేయాలి. భారత్ సహకారంతో ఉక్రెయిన్ సహా సరిహద్దు దేశాలకు సహకారం అందించడం.. రష్యా దాడులను ఆపేందుకు జపాన్ కృషి చేస్తుంది."
-ఫుమియో కిషిడా, జపాన్ ప్రధాని