Pawan Kalyan Election Campaign: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రాబోయే ఎన్నికలకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో ముందు నుంచి చెప్తునట్టుగానే నేడువారాహి యాత్రను ప్రారంభించారు. కాకినాడ జిల్లా కత్తిపూడి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ పార్టీని స్థాపించి పదేళ్లపాటు నడపడం సాధారణ విషయం కాదన్న పవన్.. రూ.10 వేల కోట్లు ఉన్నా పార్టీని నడపడం అసాధ్యమని వెల్లడించారు. ప్రజలు గుండెల్లో పెట్టుకుంటేనే పార్టీని నడపగలమని పేర్కొన్నారు. పార్టీల భావజాలం అర్థం చేసుకునే వ్యక్తులుంటేనే పార్టీని నడపగలమని వెల్లడించారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని జనసేన గుండెల్లో పెట్టుకుందని వెల్లడించారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని యువతరం ముందుకు తీసుకెళ్లాలని పవన్ పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తిలోనూ మంచిని తీసుకుని చెడును వదిలేయాలని పవన్ వెల్లడించారు.
ఇకపై రాజకీయాలు ఆంధ్ర నుంచే: భవిష్యత్‌లో వైసీపీని ఎదుర్కొనేది జనసేన మాత్రమే అని పవన్ వెల్లడించారు... దమ్ముంటే తనను అడ్డుకోవాలని సీఎంకు పవన్ సవాలు విసిరారు. పార్టీ నడిపేందుకే సినిమాలు చేస్తున్నానని పవన్ పేర్కొన్నారు. విభజించే పాలన చేస్తూ... వేల కోట్లు దోచేస్తూ తనను లక్ష్యంగా చేసుకున్నారని పవన్ ఆరోపించారు. తనను అడ్డుకునేందుకు తన సినిమాలను అడ్డుకున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా టికెట్ల మీద కూడా దిగజారిపోయే వ్యక్తి ఈ సీఎం అని పవన్ విమర్శించారు. తెలంగాణను దోచుకున్నారని ఏపీ నేతలు తిట్టించుకున్నారన్న పవన్.. విడిపోయిన తర్వాతైనా ఆంధ్ర నేతలకు బుద్ధి రావాలి కదా అని పవన్ ఎద్దేవా చేశారు. జనసేన కేంద్ర కార్యాలయం ఏపీలో ఉండాలనే తన పిల్లల కోసం పెట్టిన నిధితో పార్టీ ఆఫీస్ కట్టానని వెల్లడించారు. ఇకపై మొత్తం రాజకీయాలు ఆంధ్ర నుంచేచేస్తానని పవన్ వెల్లడించారు.