Janasena Party Meeting Pawan Kalyan: మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రస్థాయి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై జనసేన నేతలు చర్చించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యాచరణతో పాటు టీడీపీతో పొత్తును క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్లడంపై చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు.
స్పష్టమైన అవగాహన ఉంది: తాను ఏం చేసినా దేశ సమగ్రత గురించే ఆలోచిస్తానని, కార్యకర్తల చిత్తశుద్ధి వల్లే తమ పార్టీకి దిల్లీలోనూ గుర్తింపు వచ్చిందని పవన్ అన్నారు. భావజాలం ఏమీ లేని పార్టీ వైసీపీ అన్న పవన్, సమాజాన్ని ఎలా చూస్తామనే దానిపై జనసేనలో స్పష్టమైన అవగాహన ఉందని తెలిపారు.
నాపై సందేహం ఎందుకు? : కష్టకాలంలో అండగా నిలిచిన అందరినీ గుర్తుపెట్టుకుంటానని పవన్ తెలిపారు. అందరికీ మేలు చేసే నిర్ణయం తీసుకుంటానని నమ్మితే చాలని అన్నారు. మోదీకి, నడ్డాకు అర్థమైనా మీకెందుకు నాపై సందేహమని పవన్ ప్రశ్నించారు. టీడీపీ-జనసేన వ్యతిరేకులను వైసీపీ వ్యక్తులుగా భావిస్తానని, జగన్‌ను కనీసం 10 ఏళ్లపాటు రాజకీయాల వైపు చూడకుండా చేయాలని పేర్కొన్నారు. రాబోయే వంద రోజుల్లో ప్రతిరోజు జగన్‌కు అరశాతం ఓట్లు తగ్గాలని, నారా లోకేశ్ యువగళంలో జనసైనికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
యువత ఆదరణ చూసే తెలంగాణలో పోటీ: తెలంగాణ నగరప్రాంతాల్లో ఓటింగ్‌కు యువత దూరంగా ఉన్నారని జనసేనకు యువతే పెద్ద బలమని పవన్ అన్నారు. తమ పార్టీకి యువత బలం చూసి బీజేపీ పెద్దలే ఆశ్చర్యపోయారని, ఏపీలో జనసేనకు ఇవాళ ఆరున్నర లక్షల క్యాడర్ ఉందని తెలిపారు. ఇంతమంది అభిమానుల బలం ఉందని మనకు గర్వం రాకూడదని, పొరుగు రాష్ట్రాల యువత కూడా మనకు మద్దతిస్తున్నారని పేర్కొన్నారు. తనను, తన భావజాలాన్ని నమ్మే యువత తమ వెంట వస్తున్నారని, యువత ఆదరణ చూసే తెలంగాణలో 8 చోట్ల పోటీ చేశామని చెప్పారు.
తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే ఆంధ్రాలో రౌడీలను ఎదుర్కొంటున్నా : పవన్ కల్యాణ్
కష్టాల్లో ఉన్నా సాయం కోరలేదు: తాను మొదట్నుంచీ పదవులు కోరుకోలేదని, నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకు సేవ చేయాలని అనుకున్నానని స్పష్టం చేశారు. స్వార్థం వదిలేయాలని నాయకులను కోరుతున్నానని పవన్ అన్నారు. చేసే పని, పోరాటమే గుర్తింపు ఇస్తుందని వ్యాఖ్యానించారు. కష్టాల్లో ఉన్నాం, సాయం చేయాలని దిల్లీ పెద్దలను ఎప్పుడూ అడగలేదని, సినిమాలు ఆపేసినా, హోటల్‌కు వచ్చి బెదిరించినా సాయం కోసం ఎవరినీ కలవలేదని అన్నారు.
కులం మీద రాజకీయాలు నడపలేం: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పనిచేశాయని, వైసీపీను తట్టుకునేందుకే కలిసి పనిచేస్తున్నామని వాళ్లు చెప్తున్నారని పేర్కొన్నారు. మెగాస్టార్, సూపర్‌స్టార్‌ను సైతం వైసీపీ వాళ్లు బెదిరిస్తారని.. అవమానం జరిగినా, దెబ్బపడినా తాను మరిచిపోనని మండిపడ్డారు. విభజన సమయంలో రాష్ట్రానికి ఏం కావాలో ఎవరూ గట్టిగా అడగలేదని అన్నారు. రాష్ట్రానికి ఏం ఇస్తే లాభమో ఏ నేతలూ ఆలోచించలేదని విమర్శించారు. ఒక కులం మీద రాజకీయాలు నడపలేమని, అది సాధ్యం కాదని చెప్పారు.