Pawan Tour In East Godavari: తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం కడియంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు. కడియం ఆవలో నిల్వ చేసిన ధాన్యం రాశుల్ని పరిశీలించారు. రైతుల కష్టనష్టాలు, దెబ్బతిన్న పంట వివరాలు అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలకు తమ పంట ఎలా తడిసింది, మొలకెత్తిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం, మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసేందుకు ఎదురు డబ్బులు వసూలు చేయడం వంటి విషయాలను పవన్ కల్యాణ్‌కు రైతులు ఏకరువు పెట్టారు.
పవన్‌కు సమస్యలు చెప్పుకుని వాపోయిన రైతులు:రోజుల తరబడి కోత కోసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్లే అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. ఆ ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు, ఆ తర్వాత తడిసిన పొలాల్లో మిగిలిన కోతను కోసేందుకు అదనపు ఖర్చులు అయి అప్పుల పాలయ్యామని పవన్ ముందు తమ గోడు వెల్లబోసుకున్నారు. అలాగే ఆవలో డ్రెయిన్ ఏటా పొలాలను ముంచేస్తూ నష్టం కలిగిస్తున్న తీరును కూడా పవన్‌కు వివరించారు. పొలం గట్లపై ఉన్న ధాన్యం రాశులను చూసేందుకు పొలాల్లోకి పవన్ దిగడంతో అభిమానులు ఆయన్ను చుట్టుముట్టారు. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. పవన్ వెంట పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.