kririti cinema entry: కర్ణాటకలో ప్రముఖుల వారసులు సినిమా పరిశ్రమలోకి వస్తున్నారు. ఇప్పటికే ఇప్పటికే హెచ్డీ కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి, చెలువరాయ స్వామి కొడుకు సచిన్, జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్ లాంటి వారు కన్నడ సినిమాలో ఎంట్రీ ఇచ్చి వారిదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. అయితే తాజాగా వారి సరసన మరో వారసుడు చేరబోతున్నాడు. అతనే కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి. త్వరలోనే సినిమా రంగ ప్రవేశం చేయనున్నట్లు డైరెక్టర్ రాధాకృష్ణ రెడ్డి తెలిపారు.
గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో కిరీటి రెడ్డి డ్యాన్స్‌తో అదరగొట్టాడు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారు చాలా మంది కిరీటి డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయారంట. అప్పుడే కిరీటి రెడ్డి సినీ రంగ ప్రవేశం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మాయాబజార్ దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి .. ఆయన ఎంట్రీపై స్పందించారు. పీఆర్కే బ్యానర్లో కిరీటిని పరిచయం చేస్తున్నట్లు ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కిరీటి ఇప్పటికే డ్యాన్స్, యాక్టింగ్‌లో పట్టు సాధించేందుకు శిక్షణ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నటుడు కావాలన్నది కిరీటి చిన్ననాటి కల అని అన్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 'జాకీ' చిత్రం స్ఫూర్తితోనే కిరీటి చిత్ర రంగం ప్రవేశం చేస్తున్నట్లు వివరించారు.
కన్నడ సినీ పరిశ్రమతో పాటు చాలామంది నటీనటులతో జనార్దన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. తన కుమారుడ్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడానికి అవసరమైన అన్ని శిక్షణలు ఇస్తున్నట్లు సంబంధీకులు చెప్తున్నారు. అమెరికాలో చదువుతున్నప్పుడు కిరీటి నటనలో శిక్షణ పొందాడు.