Pawan Kalyan : మన దృష్టి మళ్లించేందుకు కొన్ని శక్తులు పని చేస్తున్నాయి.. మన పార్టీపై కుట్రలు చేస్తున్నట్టు సమాచారం ఉంది.. జనసేన శ్రేణులు అడుగడుగునా అప్రమత్తంగా ఉండాలి అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించారు. తీవ్ర ఆర్థిక నేరాలు, ఆరోపణలపై మాట్లాడాల్సి వస్తే.. జాగ్రత్తలు అవసరం అని జనసైనికులను ఉద్దేశించి బహిరంగ లేఖలో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న తరుణంలో మన దృష్టిని మళ్లించడానికి, మన భావజాలాన్ని కలుషితం చేయడానికి కొన్ని శక్తులు నిరంతరం పని చేస్తున్నాయని జనసేన పవన్ కళ్యాణ్ శ్రేణులను ఉద్దేశించి లేఖ విడుదల చేశారు.
మన దృష్టి మళ్లించేందుకు కొన్ని శక్తులు పని చేస్తున్నాయి: పవన్ కల్యాణ్
14:52 April 24
జనసేన శ్రేణులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ బహిరంగలేఖ
కుట్రలను అర్థం చేసుకోవాలి... రాజకీయ కుట్రలను అర్థం చేసుకుని పార్టీ నాయకులు, శ్రేణులు ముందుకు వెళ్లాలని సూచించారు. జనసేనతో సానుకూలంగా వ్యవహరించే రాజకీయ పక్షాలు, నాయకులతో వైరుధ్యం పెంచేలా, స్నేహపూర్వక వాతావరణాన్ని దెబ్బతీసేలా కల్పిత సమాచారాన్ని జనసేన శ్రేణులకు అందించే కుట్ర జరుగుతున్నదని పవన్ హెచ్చరించారు. సరైన ధ్రువ పత్రాలు లేకుండా ఎవరిపైనా ఆర్థిక నేరారోపణలు చేయకండి.. కేవలం మీడియాలో వచ్చిందనో లేదా ఎవరో మాట్లాడారనో నిర్ధారణ కాని అంశాల గురించి మాట్లాడకండి అని స్పష్టం చేశారు. పొత్తుల గురించి సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారం ఆధారంగా మాట్లాడొద్దని తెలిపారు. ఆ విషయంలో మేలు చేసే నిర్ణయం తానే స్వయంగా తీసుకుంటానని వెల్లడించారు. మనతో సయోధ్యగా ఉన్న రాజకీయ పక్షాల్లో చిన్నా, చితకా నాయకులు మనపై ఏవైనా ఆరోపణలు, విమర్శలు చేస్తే.. ఆ విమర్శలు ఆ నాయకుని వ్యక్తిగతమైన విమర్శలుగా భావించాలని సూచిస్తూ.. వాటిని ఆయా పార్టీలకు ఆపాదించవద్దని తెలిపారు.
శ్రేణులకు దిశా నిర్దేశం.. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పవన్ దిశా నిర్ధేశం చేశారు. తీవ్ర విమర్శలు చేయాల్సి వస్తే రాజకీయ వ్యవహారాల కమిటీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రాజకీయ వ్యవహారాల విషయంలో కమిటీ సూచనల మేరకే మాట్లాడాలని పవన్ స్పష్టం చేశారు. మాట్లాడే ముందు వాస్తవాలు నిర్ధారించుకోవాలని, హద్దులు దాటినట్లు సమాజం భావించని విధంగా మసలుకోవాలని కోరారు. ముఖ్యంగా విమర్శల సమయంలో కుటుంబ సభ్యుల పేర్ల ప్రస్తావన తీసుకురావద్దని పవన్ సూచించారు. సరైన ఆధారాలు లేకుండా నేరారోపణలు చేయవద్దని, ఆర్థిక నేరారోపణలు వద్దు అని చెప్తూ.. నిర్ధారణ కాని అంశాల గురించి మాట్లాడవద్దని పేర్కొన్నారు.
ఇవీ చదవండి :