Tunnel Collapse: జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గం కూలిన ఘటనలో పెను విషాదం నెలకొంది. శిథిలాల నుంచి మృతదేహాలు బయటపడుతున్నాయి. దీంతో ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య పదికి చేరింది. ఈ ఘటనలో ఇప్పటివరకు పది మృతదేహాలను వెలికితీసినట్టు రాంబన్ పోలీసులు ప్రకటించారు. మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.
రాంబన్ జిల్లాలోని ఖూనీ నాలా వద్ద జమ్ము- శ్రీనగర్ హైవేపై నిర్మిస్తున్న సొరంగ మార్గంలోని కొంత భాగం గురువారం రాత్రి కూలిపోయింది. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో 10 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. దీంతో పోలీసులు, స్థానిక అధికారులు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం తాజాగా మరో కొండచరియ విరిగిపడటం వల్ల సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ప్రమాదం నుంచి 15 మంది త్రుటిలో తప్పించుకున్నారు.