తెలంగాణ

telangana

ఒకేరోజు మూడు ఉగ్ర ఘటనలు, పౌరులపై గ్రెనేడ్ అటాక్, సైన్యంపై ఆత్మాహుతి దాడికి యత్నం

By

Published : Aug 21, 2022, 10:58 PM IST

జమ్ము కశ్మీర్​లో ఒకేరోజు మూడు ఉగ్ర సంబంధిత ఘటనలు వెలుగు చూడటం కలకలం రేపింది. శ్రీనగర్​లోని నిషాత్ గార్డెన్ సమీపంలో గ్రెనేడ్ దాడి జరగ్గా.. దాల్ సరస్సు సమీపంలో భారీ ఐఈడీ పోలీసుల కంటపడింది. మరోవైపు, సరిహద్దులో ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి యత్నించాడు.

jammu kashmir terrorist news
jammu kashmir terrorist news

జమ్ము కశ్మీర్​ శ్రీనగర్​లోని నిషాత్ గార్డెన్ సమీపంలో గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు పౌరులు గాయపడ్డారు. స్వల్ప స్థాయిలో ఈ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. దాల్​ సరస్సు సమీపంలో ఉన్న మొఘల్ గార్డెన్ బయట ఈ ఘటన జరిగిందని చెప్పారు.

ఉగ్ర కుట్ర భగ్నం
మరోవైపు, త్రాల్ సమీపంలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టి సుమారు 12 కిలోల ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు. ఐఈడీని సురక్షితంగా పేల్చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఆత్మాహుతి దాడికి యత్నం
ఇదిలా ఉండగా, సరిహద్దులో ఓ ఉగ్రవాది.. ఆత్మహుతి దాడికి పాల్పడేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. అధికారుల సమాచారం ప్రకారం.. నౌషీరా పట్టణంలోని సెహర్ మక్రీ ప్రాంతంలో బలగాలు పహారా కాస్తున్న సమయంలో ఓ వ్యక్తి పోలీసులవైపు దూసుకొచ్చాడు. అతడి రాకను గమనించిన బలగాలు.. కాల్పులు జరిపాయి. నిందితుడిని తబారక్ హుస్సేన్​గా గుర్తించాయి. పారిపోయేందుకు ప్రయత్నించగా.. కాల్పులు జరిపినట్లు రాజౌరీ జిల్లా పోలీసులు తెలిపారు. బుల్లెట్ గాయం కావడం వల్ల నిందితుడు ఆగిపోయినట్లు చెప్పారు.

'చొరబాటుదారుడిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లాం. ప్రాథమిక చికిత్స అనంతరం రాజౌరీలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించాం. అతడు సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తూ రెండోసారి పట్టుబడ్డాడు. అతడి చంకలు, మర్మాంగాల వద్ద క్లీన్ షేవ్ చేసినట్లు ఉంది. ఆత్మాహుతి దాడులకు పాల్పడే సమయంలో ఉగ్రవాదులు సాధారణంగా ఇలాగే చేస్తారు' అని పోలీసులు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details