KASHMIR TERRORISM KILLINGS: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదానికి సంబంధించి ఆసక్తికరమైన నివేదికను అధికారులు విడుదల చేశారు. ఇందులో కొన్ని కీలక అంశాలను వెల్లడించారు. ఉగ్రవాదం వైపు మళ్లుతున్న యువతలో అత్యధికులు తొలి ఏడాదిలోనే హతమవుతున్నారు. ఈ శాతం 64.1గా ఉందని తెలిపారు. బలమైన క్షేత్రస్థాయి నిఘా వ్యవస్థతో ఇందులో 28.1% మందిని తొలి నెలలోనే భద్రతా బలగాలు అంతమొందిస్తుండగా, 54.7 శాతాన్ని తొలి ఆరు నెలల్లో, 59.4 శాతాన్ని తొమ్మిది నెలల్లో ఏరివేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 1-మే 31 మధ్య ఈ డేటా సేకరించినట్లు అధికారులు తెలిపారు.
పాక్ ఉగ్రవాదులే అత్యధికం
కశ్మీర్ లోయలో పాక్ ఉగ్రవాదుల చొరబాట్లు ఇటీవల భారీగా పెరుగుతున్నట్లు ఈ నివేదిక తెలిపింది. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో భద్రతా దళాల చేతిలో 90 మంది ముష్కరులు మృతి చెందితే.. అందులో 26 మంది పాక్ జాతీయులే కావడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్యలో భారీగా పెరుగుదల కనిపించింది. నిరుడు మొత్తం 182 మంది ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్‌లో భద్రతాదళాలు మట్టుబెడితే అందులో 20 మంది మాత్రమే విదేశీయులు.