తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆర్మీ వ్యాన్​పై ఉగ్రదాడి.. ఐదుగురు జవాన్లు మృతి - jammu kashmir terror attack 5 army died

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. సైన్యానికి చెందిన వాహనంపై దాడి దిగి.. ఐదుగురు జవాన్లను బలిగొన్నారు.

jammu kashmir poonch terror attack 5 army died
జమ్ముకశ్మీర్​ పూంచ్​లో ఉగ్రదాడి ఐదుగురు జవాన్లు మృతి

By

Published : Apr 20, 2023, 7:46 PM IST

Updated : Apr 20, 2023, 10:02 PM IST

జమ్ముకశ్మీర్​లో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. రాజౌరీ సెక్టార్​లోని భింబేర్​ గలీ, పూంచ్​ మధ్య గురువారం జరిగిందీ ఘటన. పిడుగుపాటు వల్ల వాహనంలో మంటలు చెలరేగి, ఐదుగురు మరణించారని తొలుత వార్తలు రాగా.. ఉగ్రదాడి వల్లే ఇలా జరిగిందని అధికారులు ప్రకటించారు.

భారత సైన్యం అధికారుల ప్రకారం.. రాష్ట్రీయ రైఫిల్స్​ విభాగానికి చెందిన జవాన్లు.. రాజౌరీ సెక్టార్​లో ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో భాగంగా భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. గురువారం కొందరు గుర్తు తెలియని దుండగులు.. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. వెంటనే వాహనానికి మంటలు అంటుకున్నాయి. ముష్కరులు విసిరిన గ్రెనేడ్ల కారణంగానే వ్యాన్​లో మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో రాష్ట్రీయ రైఫిల్స్​ యూనిట్​కు చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రుడ్ని వెంటనే రాజౌరీలోని సైనిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తునట్టు వివరించారు. దాడి జరిగిన ప్రదేశంలో ముమ్మరంగా గాలింపు చర్యలు సాగుతున్నట్లు భారత సైన్యం అధికారులు వెల్లడించారు. ఘటనకు కారణమైన ముష్కరులను గుర్తించేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆర్మీ పేర్కొంది.

పిడుగుపాటు అనుకుని..
ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగాయని గురువారం సాయంత్రమే సమాచారం అందింది. అయితే.. వ్యాన్​పై పిడుగు పడడం వల్లే ఇలా జరిగి ఉంటుందని, ఉగ్రవాద కోణం లేదని తొలుత అధికారులు చెప్పారు. కొద్ది గంటలకే.. ఉగ్రదాడి జరిగినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇటీవల పంజాబ్‌లోని అత్యంత కీలకమైన బఠిండా సైనిక స్థావరంలో జరిగిన కాల్పుల ఘటన మరవకముందే ఈ విషాదం జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

ఈ ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడికి సంబంధించి పూర్తి వివరాలు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేను ఆయన అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు, విజిబులిటీ సరిగా లేకపోవడం వంటి పరిస్థితులను అనుకూలంగా మలుచుకున్న గుర్తు తెలియని ఉగ్రవాదులు సైనికులు వెళ్తున్న ట్రక్కును లక్ష్యంగా చేసుకొని గ్రనేడ్లతో మెరుపుదాడికి దిగారని సైనిక అధికారులు రాజ్‌నాథ్​కు వివరించారు.

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​-జవాన్​ మృతి!
కొద్ది రోజుల క్రితం దక్షిణ కశ్మీర్​​ అనంతనాగ్ జిల్లాలోని కోకెర్​నాగ్ ప్రాంతంలో ముష్కరులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో నషీన్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో జవాన్​ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నషీన్​ మరణించారు.

Last Updated : Apr 20, 2023, 10:02 PM IST

ABOUT THE AUTHOR

...view details