జమ్ముకశ్మీర్‌లో సాధారణ పౌరులే లక్ష్యంగా ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజౌరీ జిల్లాలో ఓ వర్గానికి చెందిన 3 ఇళ్లపై ఉగ్రమూకలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు పౌరులు దుర్మరణం చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టి ఆయుధాలు కలిగి ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాయి.
మొత్తం 10 మందికి బుల్లెట్ గాయాలు కాగా వారిలో రాజౌరీ ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో ముగ్గురు మృతిచెందారని, జమ్ముకు తరలించిన మరొకరు కూడా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం జమ్ముకు వాయుమార్గం ద్వారా తరలించారు. ఈ ఘటన పూర్తిగా భద్రతా వైఫల్యమని స్థానిక గ్రామ సర్పంచ్ పేర్కొన్నారు. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన వ్యాపారులు.. సోమవారం రాజౌరీ జిల్లాలో బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ముందస్తుగానే సున్నిత ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
పేలుడుకు ఇద్దరు చిన్నారులు బలి
ఇదిలా ఉండగా.. సోమవారం రాజౌరీలోని దాంగ్రి ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు గాయపడ్డారని అధికార వర్గాలు తెలిపాయి. మృతిచెందిన చిన్నారులిద్దరూ అన్నాచెల్లెళ్లు అని చెప్పాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించాయి. పేలుడుకు ఐఈడీ వాడినట్లు సమాచారం. ఆదివారం దాడి జరిగిన బాధితుడి ఇంటి వద్దే తాజా పేలుడు చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో సైన్యంతో కలిసి జమ్ముకశ్మీర్ పోలీసులు ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. కాగా, ఇదే ప్రాంతంలో మరో ఐఈడీ కనిపించిందని జమ్ము ఏడీజీపీ ముకేశ్ సింగ్ తెలిపారు. దాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.