Jammu Kashmir Infiltration :జమ్ముకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఉగ్రవాదులు చేసిన భారీ కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. చిమ్మచీకట్లో చొరబాటుకు యత్నించిన ఉగ్ర ముష్కరులను తరిమికొట్టాయి. ఈ మేరకు ఆర్మీ అధికారులు శనివారం వెల్లడించారు.
అఖ్నూర్‌లోని ఖోర్ సెక్టార్‌లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నలుగురు ముష్కరులు భారీ ఎత్తున ఆయుధాలతో అంతర్జాతీయ సరిహద్దును దాటేందుకు యత్నించారు. నిఘా పరికరాల సాయంతో ఉగ్రవాదులను గుర్తించిన భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే వారిపై కౌంటర్ ఆపరేషన్ చేపట్టారు. ముష్కరులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. భద్రతా దళాలు కాల్పులతో ఉగ్రవాదులు వెనక్కి పారిపోయారని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఓ మృతదేహాన్ని మిగతా ముష్కరులు తమతో పాటు లాక్కెళ్లినట్లు తెలిపారు. కాగా జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఇటీవల జరిగిన భీకర ఉగ్రదాడి వేళ ఉగ్రవాదుల చొరబాటు ఘటన కలకలం రేపింది.
రెండు రోజుల క్రితం పూంఛ్ జిల్లాలో జవాన్లను తరలిస్తున్న సైనిక వాహనాలపై పక్కా ప్రణాళికతోనే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఈ దాడికి పాల్పడిన ముష్కరుల కోసం భద్రతా బలగాలు ముమ్మర వేట సాగిస్తున్నాయి. మరోవైపు, పూంఛ్ సెక్టార్‌లో దాదాపు 25 నుంచి 30 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు నక్కినట్లు భద్రతా దళాలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి దాదాపు 300 మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారని ఇటీవల బీఎస్‌ఎఫ్ ఐజీ అశోక్ యాదవ్ వెల్లడించారు. ముష్కరులు భారత్‌లోకి అక్రమంగా చొరబాటుకు వేచి చూస్తున్నారని ఆయన తెలిపారు.