Jammu Kashmir Encounter Today :జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడమే కాకుండా వాతావరణం ప్రతికూలంగా ఉండడం వల్ల నియంత్రణ రేఖ మీదుగా భారీగా ఆయుధాలతో ఉగ్రవాదుల బృందం చొరబాటుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు అక్కడి చేరుకొని వారిని నిలువరించేందుకు యత్నించారు. ఈ క్రమంలో బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని.. మిగతా ఉగ్రవాదులు వారి మృతదేహాలను తీసుకొని అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారని పేర్కొన్నారు. ఘటనాస్థలం నుంచి రెండు ఏకే రైఫిళ్లు, ఆరు పిస్తోళ్లు, నాలుగు చైనీస్ గ్రానైడ్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఫేక్ పాస్‌పోర్టులతో దేశంలోకి టెర్రరిస్టులు..
Terrorists Enters In India : ఇటీవలే నకిలీ పాస్‌పోర్టులతో భారత్‌లోకి అక్రమంగా ఉగ్రవాదులు ప్రవేశించినట్లు కేంద్ర నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేశాయి. సుమారు 70 మంది టెర్రరిస్టులు నేపాల్ సరిహద్దుల నుంచి దేశంలోకి ప్రవేశించినట్లు భావించాయి. వీరంతా బంగ్లాదేశ్ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్)లేదా జమ్మాత్ ఉల్ ముజాహీద్దీన్ ఉగ్ర సంస్థకు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ సరిహద్దులోని భద్రతాదళాలను అప్రమత్తం చేసింది కేంద్ర హోంశాఖ.