Jammu Kashmir Encounter Today : జమ్ముకశ్మీర్.. కుప్వారాలో భారీ ఎన్కౌంటర్జరిగింది. ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు కలిసి సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి నియంత్రణ రేఖ సమీపంలో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇంకా ముష్కరుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని కశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ తెలిపారు.
'కుప్వారాలోని నియంత్రణ రేఖ సమీపంలో ఉగ్రవాదులు, ఆర్మీ మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దీంతో ఆర్మీ, భద్రతా బలగాలు కలిసి ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.' అని కశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు.
అంతకుముందు జూన్ 13న కుప్వారా సరిహద్దులో ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టారు.
మసీదులో దాక్కున్న ముష్కరులు హతం..
ఈ ఏడాది ఫిబ్రవరిలో కశ్మీరీ పండిత్‌ను చంపి, మసీదులో దాక్కున్న ఇద్దరు తీవ్రవాదులను భద్రత బలగాలు మట్టుబెట్టాయి. తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో.. ఓ జవాన్ సైతం ప్రాణాలు కోల్పోయారు. మసీదుకు ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్న అధికారులు.. చాకచక్యంగా వ్యవహరించి తీవ్రవాదులను హతమార్చారు. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన భద్రత దళాలు.. అనంతరం ఉగ్రవాదులను కాల్చి చంపాయి.
కశ్మీరీ పండిత్‌ను కాల్చి చంపిన ఆ ఇద్దరు తీవ్రవాదులు..
ఎన్కౌంటర్లో మరణించిన ఇద్దరు తీవ్రవాదులు.. సంజయ్ శర్మ అనే ఓ బ్యాంక్ సెక్యూరిటీ గార్డును అంతకుముందు కాల్చి చంపారు. అతడు ఓ కశ్మీరీ పండిత్ కావడం గమనార్హం. అనంతరం ఆ ఇద్దరు ఉగ్రవాదులు స్థానిక మసీదులోకి వెళ్లి తలదాచుకున్నారు. తీవ్రవాదులు మసీదులో దాక్కున్నారని తెలుసుకున్న భద్రత బలగాలు.. ఆ పరిసరాలను చుట్టుముట్టాయి. మసీదుకు ఎటువంటి నష్టం జరగకుండా సంయమనం పాటించాయి. తీవ్రవాదులను మట్టుబెట్టేందుకు నిదానంగా ముందుకు కదిలాయి. అదే సమయంలో తీవ్రవాదులు.. బలగాలపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 55 రాష్ట్రీయ రైఫిల్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ జవాన్‌కు బుల్లెట్ తగిలింది. అతడి తొడ భాగంలోకి తూటా దూసుకెళ్లింది. దీంతో జవాన్‌కు తీవ్ర రక్తస్రావం జరిగింది. అనంతరం ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
రూట్ మార్చిన ఉగ్రవాదులు..
కశ్మీర్ లోయలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు, తమ ఉనికి చాటుకునేందుకు.. ఉగ్రవాదులు, పాకిస్థాన్ ఐఎస్‌ఐ కొత్త మార్గాన్ని ఎంచుకున్నాయి. కశ్మీర్ లోయలో ఆయుధాలు, మాదకద్రవ్యాలు, సందేశాల చేరవేతకు ఐఎస్‌ఐ, ఉగ్రవాద సంస్థలు మహిళలు, పిల్లలను ఉపయోగిస్తున్నట్లు సైనిక ఉన్నతాధికారి ఇటీవల తెలిపారు. ఇది చాలా ప్రమాదకరమైన అంశమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నియంత్రణ రేఖ వెంబడి తిష్ఠవేసిన మూకలు శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాల్లో ఉన్నాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సైనిక బలగాలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చినార్ కార్ప్స్ గా పిలిచే శ్రీనగర్‌కు చెందిన 15 కోర్ జీవోసీ లెఫ్టినెంట్ జనరల్ అమర్‌దీప్ సింగ్ ఔజ్లా తెలిపారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.