తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 10 మంది మృతి

Jammu bus accident : మాతా వైష్ణోదేవి భక్తులతో వెళ్తున్న బస్సు.. అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

Jammu bus accident
Jammu bus accident

By

Published : May 30, 2023, 8:24 AM IST

Updated : May 30, 2023, 11:49 AM IST

Jammu bus accident : జమ్ము కశ్మీర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్ము జిల్లాలో వంతనపై నుంచి వెళ్తుండగా ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 57 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. కత్రా ప్రాంతానికి వెళ్తుండగా.. జజ్జర్ కోట్లీ వద్ద ప్రమాదం జరిగింది. ప్రయాణికులంతా మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్నట్లు సమాచారం. సాధారణంగా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులు.. కత్రాలోని బేస్ క్యాంప్​ మీదుగా ప్రయాణిస్తుంటారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టినట్లు జమ్ము సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్ చందన్ కోహ్లీ తెలిపారు. గాయపడిన వారిని జమ్ములోని జీఎంసీ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. బస్సులో చిక్కుకున్న వారందరినీ బయటకు తీసినట్లు తెలిపారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నారని చందన్ కోహ్లీ వివరించారు. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు, సహాయక చర్యల కోసం ఎస్​డీఆర్ఎఫ్, సీఆర్​పీఎఫ్ సైతం రంగంలోకి దిగాయి.

లోయలో పడిన బస్సు

"సీఆర్​పీఎఫ్, పోలీసులు, ఇతర సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. అంబులెన్సులను పిలిచి వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాం. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. ప్రమాదానికి గురైన బస్సు కింద ఎవరైనా చిక్కుకున్నారేమోనని పరిశీలిస్తున్నాం. ఇందుకోసం ఓ క్రేన్​ను రప్పించాం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు అమృత్​సర్ నుంచి వస్తున్నట్లు మాకు తెలిసింది. బస్సులో బిహార్​కు చెందినవారు ఉన్నారు. కత్రాకు వెళ్లే క్రమంలో వారు దారితప్పినట్లు ఉన్నారు."
-అశోక్ చౌదరి, సీఆర్​పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్

రాష్ట్రపతి సంతాపం.. సీఎం పరిహారం
ప్రమాదాన్ని దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రమాదంలో బిహార్​కు చెందినవారు మరణించడంపై ఆ రాష్ట్ర సీఎం నీతీశ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబీకులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు.

లోయలో పడిన బస్సు

సోమవారం కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు ప్రైవేటు బస్సు ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మైసూరు జిల్లాలోని టి.నరసిపుర్‌ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బళ్లారికి చెందిన ఓ కుటుంబం ఇన్నోవా కారులో మైసూరు ట్రిప్‌నకు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టిందని చెప్పారు. దీంతో ఇద్దరు చిన్నారులు సహా 10 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు అయింది. అందులో చిక్కుకున్నవారిని బయటకు తీయడం కష్టంగా మారిందని స్థానికులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Last Updated : May 30, 2023, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details