జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ప్రముఖ ఆహారశాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పటిష్ఠ సైనిక పహారా ప్రాంతంలో ఉండే 'కృష్ణ దాబా' యజమాని కుమారుడిపై ముష్కరులు అత్యంత దగ్గరగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆకాశ్ మెహ్రా అనే బాధితుడు.. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతని పరిస్థితి విషమంగా ఉంది.
నిత్యం సైనిక పహారాలో ఉండే ఈ దాబా శాకాహార భోజనానికి ప్రసిద్ధి. శ్రీనగర్‌లోని దుర్గనాగ్ ప్రాంతంలో అత్యంత సున్నిత ప్రాంతంలో ఉంటుంది. 'ముస్లిం జన్ బాజ్' అనే నిషేధిత ఉగ్రసంస్థ ఈ కాల్పులకు బాధ్యత ప్రకటించుకుంది.
ప్రధాన కార్యాలయాలకు నెలవు..
భారత్-పాక్ ల మిలిటరీ వ్యవహారాల పరిశీలకుల కార్యాలయం(యూఎన్‌ఎమ్‌ఓజీఐపీ) సహా.. జమ్ముకశ్మీర్ ప్రధాన న్యాయమూర్తి నివాసం వంటి ఉన్నత గృహసముదాయాలకు నెలవైన ఈ ప్రాంతంలో ఉగ్రదాడి జరగడం గమనార్హం. అప్రమత్తమైన పోలీసులు దగ్గరలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు ఘటన అనంతరం పరుగెడుతున్న ఉగ్రవాదులను చూశామని స్థానికులు చెప్పారు.
రాయబారుల పర్యటనలో..
ఆర్టికల్-370 రద్దు అనంతర పరిస్థితులను పరిశీలించేందుకు 24 దేశాలకు చెందిన రాయబారులు కశ్మీర్‌ను సందర్శించిన రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. ఇక్కడికి 2 కిమీ దూరంలోనే రాయబారులకు బస ఏర్పాట్లు చేశారు. అక్టోబర్-2019లోనూ రాయబారుల సందర్శనలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అమాయకులైన బంగాల్‌కు చెందిన ఐదుగురు వలస కూలీలను కాల్చి చంపారు. ఈ ప్రాంతానికి ప్రత్యేక హోదా రద్దుచేసిన తరువాత కశ్మీరీయేతర వ్యక్తులపై దాడులు జరగడం ఇది రెండోసారి.
ఇదీ చదవండి:కశ్మీర్‌ను సందర్శించిన విదేశీ రాయబారుల బృందం