జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ భాజపా సర్పంచ్, ఆయన భార్యపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.
ఘటనాస్థలిలో మోహరించిన భద్రతా బలగాలు మృతులు కుల్గాం జిల్లా భాజపా కిసాన్ మోర్చా అధ్యక్షుడు గులామ్ రసూల్ దార్, ఆయన భార్య అని ఓ పోలీస్ అధికారి చెప్పారు. అనంత్‌నాగ్ పట్టణంలో వీరిపై దాడి జరిగిందని వివరించారు. తీవ్రగాయాలైన వారిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ మృతి చెందినట్లు పేర్కొన్నారు.
దంపతులపై కాల్పుల జరిగిన ప్రదేశానికి చేరుకున్న అంబులెన్సు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న అంబులెన్సు కుల్గామ్ జిల్లా రేద్వానీకి చెందిన గులామ్ రసూల్ దార్.. ఆ గ్రామ సర్పంచ్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన అనంత్‌నాగ్‌లోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.
'తగిన బుద్ధి చెబుతాం..'
సర్పంచ్ రసూల్ దార్, ఆయన భార్యపై ఉగ్రవాదుల దాడి ఘటనను జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఖండించారు. ఈ పిరికిపంద చర్యకు పాల్పడినవారికి త్వరలోనే తగిన రీతిలో బుద్ధి చెబుతామని అన్నారు. మృతుల కుటుంబానికి సంతాపం తెలిపారు.
'తప్పించుకోలేరు..'
సర్పంచ్ రసూల్ దార్ హత్య ఘటనను భాజపా ఖండించింది. ఈ దాడిని పిరికిపింద చర్యగా అభివర్ణించింది. పోలీసుల చెర నుంచి నిందితులు తప్పించుకోలేరని వ్యాఖ్యానించింది.
"పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్లో మరోసారి రక్తపాతానికి పాల్పడ్డారు. మృతిచెందిన భాజపా కిసాన్ మోర్చా నేత, ఆయన భార్య ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు రెండో వార్షికోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తిరంగ జెండాను ఎగరవేశారు. దేశం కోసం వారు తమ ప్రాణాలను త్యాగం చేశారు. వారి త్యాగాలను వృథా కావు."
-రవీందర్ రైనా, కశ్మీర్ భాజపా అధ్యక్షుడు
దేశ భద్రతా బలగాలు..ఈ దాడి కారకులను పట్టుకునేందుకు వేట ప్రారంభించాయని రవీందర్ రైనా చెప్పారు. తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుంటారని అన్నారు.
ఇదీ చూడండి:భారత్‌పై ఉగ్ర కుట్ర- డ్రోన్ ద్వారా 'టిఫిన్ బాక్స్' బాంబ్!