James vs Kashmir Files: కర్ణాటకలో 'కశ్మీర్ ఫైల్స్' చిత్రానికి సంబంధించి.. ఆ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దివంగత నటుడు, కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రమైన 'జేమ్స్' ప్రదర్శనలు తగ్గించి 'కశ్మీర్ ఫైల్స్' ప్రదర్శించేలా థియేటర్ యాజమాన్యాలపై భాజపా ఒత్తిడి తెస్తోందంటూ ఆరోపించారు. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాతే స్వయంగా తనతో చెప్పినట్లు పేర్కొన్నారు.
'జేమ్స్' చిత్రానికి థియేటర్లు తగ్గించడం ద్వారా పునీత్ రాజ్‌కుమార్‌ను, ఆయన కుటుంబాన్ని అవమానించినట్లే అని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అత్యున్నత పురస్కారం కర్ణాటక రత్నతో ప్రభుత్వం గౌరవించిన పునీత్ పట్ల కనీస మర్యాద చూపించాల్సిందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి.. సిద్ధరామయ్య చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అటువంటివి ఏమీ జరగలేదని తెలిపారు.
"కశ్మీర్ ఫైల్స్ చరిత్రకు సంబంధించినది. రెండు సినిమాలను పోల్చి చూడటంలో అర్థం లేదు. ఇలాంటి వివాదాలు సృష్టించడంలో సిద్ధరామయ్య చాలా తెలివైన వ్యక్తి. జేమ్స్ సినిమా రాష్ట్రవ్యాప్తంగా మంచి వసూళ్లు సాధిస్తోంది. అదే సమయంలో పలు ప్రాంతాల ప్రజలు కశ్మీర్ ఫైల్స్‌ను కనీసం ఒక్క షో అయినా థియేటర్లలో ప్రదర్శించమని డిమాండ్ చేస్తున్నారు. అందుకే కొన్ని థియేటర్లలో ఉదయం 8 గంటలకు ఈ సినిమా స్క్రీనింగ్ చేయాలని నేను థియేటర్ యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశాను."