Jambu Savari 2023 :కర్ణాటకలోని మైసూరు రాజకోటలో అంగరంగ వైభవంగా జరిగిన దసరా ఉత్సవాలు.. జంబూ సవారీతో మంగళవారం ముగిశాయి. గజరాజు మీద స్వర్ణ అంబారీ ఉంచి.. అందులో చాముండేశ్వరీ దేవి విగ్రహాన్ని ఊరేగించారు. స్వర్ణ అంబారీ కట్టిన ఏనుగుతోపాటు మొత్తం మరిన్ని గజరాజులు కూడా వేడుకల్లో పాల్గొన్నాయి.
బంగారు అంబారీపై చాముండేశ్వరి దేవి అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు..
Mysore Dasara Festival 2023 : వందల ఏళ్లుగా ప్రతి సంవత్సరం జరిగే ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు మైసూరు రాజవంశస్థులు, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రులు హాజరయ్యారు. భక్తులు, సందర్శకులు భారీగా మైసూరుకు తరలివచ్చారు. చాముండేశ్వరి దేవిని తీసుకొస్తున్న సమయంలో ప్యాలెస్‌లోని వీధుల్లో కళా ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. మంగళవారం సాయంత్రం 5.15 ప్రాంతంలో సీఎం సిద్ధరామయ్య ప్రముఖులతో కలిసి జంబూ సవారీని పూలజల్లుతో ప్రారంభించారు. అంతకుముందు రెండు గంటలకు నందిపూజతో ప్రారంభమైన ఊరేగింపు రాజపథ్‌లో దాదాపు ఐదు కిలమీటర్ల పాటు సాగింది.
పువ్వులు వేసి ప్రారంభిస్తున్న సీఎం సిద్ధరామయ్య, తదితరులు
కట్టుదిట్టమైన భద్రత
Mysore Palace Dasara : జంబూ సవారీ జరిగిన మార్గంలో పటిష్ఠమైన బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. సుమారు 6వేల మందికిపైగా పోలీసులు మోహరించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహా మరిన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు. ఊరేగింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. ఏనుగుల సవారీ మార్గం వెంబడి నిఘా కెమెరాల్ని ఏర్పాటుచేశారు.
యువరాజు ఆయుధపూజ
Mysore Dasara Procession :మంగళవారం ఉదయం.. మైసూరు రాజకోటలో ఆయుధ పూజ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. తొలుత మైసూర్ యువరాజు యధువీర్ కృష్ణరాజ చామరాజ వడయార్ ప్యాలెస్‌లో ఆయుధ పూజ నిర్వహించారు. ఏనుగులకు, అశ్వాలకు, గోవులకు యువరాజు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆయుధాలను సోమేశ్వరాలయం దగ్గరకు తీసుకువెళ్లి శుభ్రపరిచి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. యువరాజు యధువీర్ తన వాహనాలకు కూడా ప్రత్యేక పూజలు చేశాక.. అంబావిలాసదత్త, అమలాదేవిని దర్శించుకున్నారు.
400 ఏళ్లుగా సంప్రదాయం..
Jamboo Savari History : వడయార్ వంశస్థులు మొదటగా శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. అయితే 1610లో తమ రాజధానిని మైసూరుకు మార్చారు. ఆ సందర్భంగా దసరా వేడుకలు నిర్వహించారు. 1947లో స్వతంత్ర భారతదేశంలో విలీనం అయినప్పటికీ.. వేడుకలు మాత్రం 400 ఏళ్లుగా నిర్విగ్నంగా కొనసాగుతూనే ఉన్నాయి
బంగారు చీరలో లక్ష్మీదేవి!
Goddess Lakshmi With Gold Saree :మహారాష్ట్రలోని పుణెలో విజయదశమి పర్వదిన సందర్భంగా మహాలక్ష్మీ దేవి.. బంగారు చీరలో దర్శనమిచ్చారు. నగరంలోని సరస్బాగ్ ప్రాంతంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 21ఏళ్ల క్రితం దక్షిణ భారత కళాకారులు రూపొందించిన 16 కిలోల బంగారు చీరను అమ్మవారికి ఓ భక్తుడు సమర్పించారు. అప్పటి నుంచి ఏడాదికి రెండు సార్లు అమ్మవారికి ఆ చీరను అలంకరిస్తున్నారు నిర్వాహకులు.
బంగారు చీరలో లక్ష్మీదేవి!