Jamai Colony Faridabad: కాలనీలకు సాధారణంగా ప్రముఖుల పేర్లను వాడుతుంటారు. అందుకు కాస్త భిన్నమైన పేరుతో ఓ కాలనీ ఉంది. హరియాణాలోని ఫరీదాబాద్ జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం పేరు జమాయ్ కాలనీ. స్థానికంగా జమాయ్ అంటే అల్లుడు అని అర్థం. అంటే ఈ ప్రాంతాన్ని అల్లుళ్ల కాలనీ అంటారన్నమాట. మరి అక్కడ అందరూ అల్లుళ్లు ఉంటారా? అని మీకు సందేహం రావచ్చు. అవును.. మీరు అనుకున్నది నిజమే. ఛాజ్పుర్ గ్రామానికి చెందిన అల్లుళ్లలో ఎక్కువ మంది ఇక్కడే స్థిరపడిపోయారు. అలా ఈ కాలనీకి ఆ పేరు వచ్చి.. అల్లుళ్లకు కేరాఫ్‌గా మారింది.
మాతా కాలనీ కాస్త అల్లుళ్ల కాలనీగా..
జమాయ్ కాలనీ పేరు ప్రాచుర్యంలోకి రావడానికి ఛాజ్పుర్ గ్రామస్థులే కారణమంటున్నారు బలీందర్ అనే స్థానికుడు.
"ఎనిమిదేళ్ల క్రితం సమీపాన ఉండే ఛాజ్పుర్ గ్రామం నుంచి ఓ యువతి తన భర్తతో ఇక్కడికి వచ్చి స్థిరపడింది. ఇక్కడ చౌకగా స్థలం దొరకడమే అందుకు కారణం. ఆ తర్వాత క్రమంగా ఆ గ్రామానికి చెందిన యువతులను పెళ్లి చేసుకున్న వ్యక్తుల్లో చాలా మంది ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. అలా మాతా కాలనీగా ఉండాల్సిన పేరు కాస్త జమాయ్ కాలనీగా మారింది. ఇక్కడ సుమారు 100 ఇళ్లు ఉంటాయి."