Jallikattu Judgement : తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. జల్లికట్టుపై తమిళనాడు సర్కారు చేసిన చట్టాన్ని సమర్థించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. తమిళ సంస్కృతిలో జల్లికట్టు ఓ భాగమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
"గత శతాబ్ద కాలంగా తమిళనాడులో జల్లికట్టును నిర్వహిస్తున్నారు. ఇది ఆ రాష్ట్ర సంస్కృతిలో భాగమా? కాదా? అన్నదానిపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోదు. అది తమ వారసత్వ సంస్కృతిలో భాగమని శాసనసభ నిర్ణయించినప్పుడు.. న్యాయవ్యవస్థ దాన్ని భిన్నకోణంలో చూడలేదు. దీనిపై శాసనసభ నిర్ణయం తీసుకోవడమే మంచిది"
--సుప్రీంకోర్టు ధర్మాసనం
పొంగల్ పండుగ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు పోటీలు నిర్వహిస్తారు. తమిళనాడులో జల్లికట్టు, మహారాష్ట్రలో ఎడ్ల బండ్ల పందేలకు అనుమతిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. జంతు హింస చట్టం జల్లికట్టుకు వర్తించదన్న సుప్రీంకోర్టు.. 2014లో వెలువరించిన తీర్పును సవరించింది. 2017లో జల్లికట్టుకు అనుకూలంగా తమిళనాడు చట్టం చేసింది. దీనికి వ్యతిరేకంగా పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై పిల్..
Gyanvapi Cosque Carbon Dating : జ్ఞానవాపి మసీదులో శివలింగం వయసును నిర్ధరించడానికి కార్బన్ డేటింగ్ చేయాలని.. మే 12న అలాహాదాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ముస్లింపక్షం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు గురువారం అంగీకరించింది.
Gyanvapi Masjid Allahabad High Court : ఈ ఏడాది మే 12న జ్ఞానవాపి మసీదులోని వాజూఖానాలో లభించిన శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించేందుకు అలహాబాద్ హైకోర్టు అనుమతిచ్చింది. హిందూపక్ష వాదనలతో ఏకీభవించిన అలహాబాద్ హైకోర్టు.. శివలింగం దెబ్బతినకుండా అత్యాధునిక టెక్నాలజీతో కార్బన్ డేటింగ్ నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
జ్ఞానవాపి మసీదులో లభ్యమైన శివలింగం వయసును నిర్ధరించేందుకు కార్బన్ డేటింగ్ నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌ను 2022 అక్టోబరు 14న వారణాసి జిల్లా కోర్టు కొట్టివేసింది. న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ.. కొందరు హిందుత్వవాదులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన జస్టిస్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కార్బన్ డేటింగ్‌కు అనుమతిస్తూ తీర్పు వెలువరించింది.
ఇదీ కేసు..
Gyanvapi Case : జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గతేడాది ఏప్రిల్‌లో కొందరు హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్ మేరకు వారణాసి కోర్టు.. ఆ ప్రార్థనా స్థలంలో గతంలో వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశించింది. సర్వే కొనసాగుతుండగా అక్కడ శివలింగం కనిపించిందంటూ హిందూ పక్షం వేసిన పిటిషన్ దాఖలు చేసింది.
కులగణనపై స్టే ఎత్తివేతకు సుప్రీం నిరాకరణ
Caste Census in Bihar : బిహార్‌లో జరుగుతున్న కుల గణన, ఆర్థిక సర్వేపై పట్నా హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ సందర్భంలో ఎటువంటి ఉపశమనాన్ని ఇవ్వలేమని బిహార్ ప్రభుత్వానికి సృష్టం చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న కుల గణనపై పట్నా హైకోర్టు ఇచ్చిన స్టేను నిలిపివేయాలంటూ.. దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టీస్ రాజేష్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా మే 4న రాష్ట్రంలో జరుగుతున్న కుల గణనను తక్షణమే నిలిపివేయాలని.. ఇప్పటివరకు సేకరించిన సమాచారాన్ని భద్రంగా ఉంచాలని.. ఎవ్వరితోనూ పంచుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.