జలియన్‌వాలాబాగ్‌లో భారతీయులను పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపిన బ్రిటిష్ ప్రభుత్వం.. వారి ప్రాణాలకు వెల కట్టడంలోనూ వివక్ష చూపింది. పరిహారం ఇచ్చే విషయంలోనూ పరిహాసమాడింది. శవాలను సైతం విభజించి పాలించింది.
1919లో జలియన్‌వాలాబాగ్ ఊచకోతపై ఇంటాబయటా తీవ్ర విమర్శలు చెలరేగాయి. నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్‌హుడ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారు. బ్రిటన్, అమెరికాల్లోనూ జనరల్ డయ్యర్ తీరుపై ఆగ్రహం వ్యక్తమైంది. ఈ సంఘటన బ్రిటన్‌పై మాయని మచ్చగా మారటంతో ప్రభుత్వం విచారణ కమిటీని వేసింది. ఆ కమిటీ డయ్యర్ తీరును తప్పుపట్టింది. ఘోరమైన తప్పు చేశాడంటూ నిందించింది. డయ్యర్‌ను వెనక్కి పిలిపించారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవటంతో తర్వాత కొన్నాళ్లకు జలియన్‌వాలాబాగ్ బాధితులకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.
చనిపోయిన వారి సంఖ్య విషయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి, ప్రజల వాదనకు భారీ తేడా ఉంది. వెయ్యిమందికిపైగా మరణించినట్లు స్థానికులు చెబుతుంటే.. ఆంగ్లేయ ప్రభుత్వం మాత్రం 376 మందే మరణించినట్లు తేల్చింది. పరిహారంపై తీవ్ర తర్జనభర్జన జరిగింది. చాలా మంది బ్రిటిష్ అధికారులు భారీ పరిహారం ఇవ్వటాన్ని వ్యతిరేకించారు. చర్చోపచర్చల అనంతరం మరణించినవారికి, గాయపడ్డవారికి, అనంతరం అల్లర్లలో ఆస్తులు దెబ్బతిన్నవారికి పరిహారం ఇవ్వాలని నిర్ణయించి 1921లో మొదలెట్టారు.