Jal Shakti Meeting on Nagarjuna Sagar Dam : ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నేడు దిల్లీలోని కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో కేంద్ర జల సంఘం,కేఆర్ఎంబీ (KRMB) ఛైర్మన్లు సమావేశమయ్యారు. సుమారు గంటపాటు ఈ భేటీ జరిగింది. నాగార్జునసాగర్, శ్రీశైలం, అనుబంధ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై ఇందులో చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మినిట్స్‌లో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ డీజీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. మరోవైపు కేంద్ర జలసంఘం, కేఆర్ఎంబీ ఛైర్మన్లు నేరుగా పాల్గొన్నారు.
Telugu States Project Disputes :ఈ వీడియో కాన్ఫరెన్సుకు ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి, జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇంధనశాఖ కార్యదర్శి కె.విజయానంద్‌తో పాటు ఈఎన్సీ నారాయణరెడ్డి హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం తరఫు నుంచి ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి నీటి అవసరాలు, అభ్యంతరాలను జలశక్తి శాఖ (Jal Shakti) అధికారులకు వివరించారు. గతంలో కేఆర్ఎంబీకి రాసిన అంశాలతో పాటు శ్రీశైలం ప్రాజెక్టులోని విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ నిర్వహించుకుంటున్న అంశాలను తెలిపారు. కరెంట్ ఉత్పత్తికి తెలంగాణ నీటిని వినియోగించుకుంటున్న విషయాలను కూడా జలశక్తి శాఖ దృష్టికి ఆయన తీసుకువచ్చారు.
ఈ క్రమంలోనే సాగర్, శ్రీశైలం వివాదంపై వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని ఈ నెల 6కు జలశక్తి శాఖ వాయిదా వేసింది. ఆదివారం రోజున తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా భేటీని వాయిదా వేయాలన్న తెలంగాణ అభ్యర్థనతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తమ నీటి అవసరాలు, ప్రాజెక్టుల వద్ద పరిస్థితి గురించి ఏపీ అధికారులు జలశక్తి శాఖ దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో స్పందించిన జలశక్తి శాఖ ఈ నెల 4న ఆంధ్రప్రదేశ్ పంపిన ఇండెంట్‌పై నిర్ణయం తీసుకోవాలని కేఆర్ఎంబీకి ఆదేశించింది. అప్పటివరకు సాగర్ నుంచి నీటి విడుదల నిలిపివేయాలని ఏపీకి సూచించింది.
సాగర్ కుడికాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి - ఏపీకి కృష్ణా బోర్డు అదేశం