తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ వచ్చిన బ్రిటన్​ మంత్రికి ఝలక్.. బీబీసీ కేసుపై ప్రశ్నలకు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ - బీబీసీ ఐటీ వివాదంపై యూకే మంత్రికి జైశంకర్ స్పందన

బీబీసీపై ఆదాయ పన్నుల శాఖ దాడుల గురించి విదేశాంగ మంత్రి జైశంకర్​ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్​లో పనిచేసే సంస్థలన్నీ దేశంలోని చట్టాలను పూర్తిస్థాయిలో పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. బీబీసీ సోదాలపై ప్రశ్నించిన బ్రిటన్​​ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లీవర్లీకి ఈమేరకు జవాబిచ్చారు.

Jaishankar responds to UK minister on BBC tax row
బీబీసీ ఐటీ వివాదంపై జైశంకర్ స్పందన

By

Published : Mar 1, 2023, 5:52 PM IST

భారత్​లో పనిచేసే సంస్థలన్నీ సంబంధిత చట్టాలను పూర్తి స్థాయిలో పాటించాలన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్. బ్రిటన్​​ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లీవర్లీ.. లేవనెత్తిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. దిల్లీలో బుధవారం ఇద్దరి మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. జీ20 సదస్సులో భాగంగా జరిగే విదేశాంగ మంత్రులు సమావేశం కోసం జేమ్స్ క్లీవర్లీ భారత్​కు వచ్చారు.

బ్రిటన్​​ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లీవర్లీతో జైశంకర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు​. భారత్-బ్రిటన్​ సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా వీరిద్దరూ చర్చలు జరిపారు. ఇదే సమావేశంలో బ్రిటన్​ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లీవర్లీ.. బీబీసీపై జరిగిన ఆదాయ పన్ను దాడుల గురించి ప్రస్తావించారు. దీనికి బదులిచ్చిన జై శంకర్​.. భారత్​లో పనిచేసే సంస్థలన్నీ అందుకు సంబంధించిన చట్టాలు, నిబంధనలు పాటించాలన్నారు. సమావేశం అనంతరం జైశంకర్​ ఓ ట్వీట్​ చేశారు. "ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై సమీక్షించుకున్నాం. ప్రపంచ పరిస్థితులు, జీ20 అజెండాపై అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నాం" అని తెలిపారు.

బీబీసీపై ఆదాయ పన్ను శాఖ దాడులు..
బీబీసీ ఇండియా కార్యాలయాల్లో ఆదాయపు పన్నుశాఖ ఇటీవల సర్వే జరిపింది. ఎలక్ట్రానిక్‌ రూపంలో, దస్త్రాల్లో ఉన్న ఆర్థిక వ్యవహారాల సమాచారం నకలు సైతం తీసుకుంది. ఫిబ్రవరి 14న ఉదయం 11.30 నిమిషాలకు దిల్లీ, ముంబయి బీబీసీ కార్యాలయాల్లో మొదలైన సర్వే మూడు రోజుల పాటు కొనసాగింది. లండన్ హెడ్ ఆఫీస్​తో పాటు భారత్​లోని కార్యాలయంలో బిజినెస్ ఆపరేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్ల కోసం అధికారులు వెతికారు. బీబీసీ అనుబంధ కంపెనీలకు సంబంధించిన ట్యాక్స్​ వివరాలపై దర్యాప్తు చేశారు.

బీబీసీ "ఇండియా.. ద మోదీ క్వశ్చన్" పేరిట బీబీసీ ఒక డాక్యుమెంటరీని విడుదల చేసింది. అనంతరం కొద్దివారాలకే బీబీసీపై ఈ ఐటీ దాడులు జరిగాయి. 2002లో మోదీ సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్​లో​ జరిగిన అల్లర్ల గురించి చెప్పడమే ఈ డాక్యుమెంటరీ ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే ఆదాయ పన్ను శాఖ అధికారులు.. బీబీసీపై సర్వే జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గుజరాత్‌ అల్లర్లకు సంబంధించి బీబీసీ వెలువరించిన రెండు విడతల డాక్యుమెంటరీపై కక్షగట్టే ఐటీ సర్వేపేరుతో సోదాలు చేస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. ఎడిటర్ గిల్డ్స్‌, అంతర్జాతీయ మీడియా సైతం ఐటీ సర్వేను తప్పుబట్టాయి. ఈ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. బీబీసీ మాత్రం ఐటీ అధికారులకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నట్లు తెలిపింది. బీబీసీపై ఆదాయ పన్ను శాఖ దాడులపై బ్రిటన్​ ప్రధాని సునాక్​ సైతం స్పందించారు.

ABOUT THE AUTHOR

...view details