తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాహుల్ యాత్ర విజయం చూడలేకే భాజపా 'ఆపరేషన్​ బురద'' - మోదీ ప్రభుత్వంపై సోనియా కమెంట్స్​

గోవాలో 8 మంది శాసనసభ్యులు భాజపాలో చేరిన నేపథ్యంలో కాంగ్రెస్​ తీవ్ర విమర్శలు చేసింది. భారత్​ జోడో యాత్ర విజయాన్ని ఓర్వలేకే ఇలాంటి పనులు చేస్తోందని మండిపడింది.

Jai Ram Ramesh Slams BJP
Jai Ram Ramesh Slams BJP

By

Published : Sep 14, 2022, 6:20 PM IST

భారత్​ జోడో యాత్రకు వస్తున్న ఆదరణను చూడలేకే భాజపా ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో జోరు పెంచిందని ఆరోపించింది కాంగ్రెస్. గోవాలో 8 మంది కాంగ్రెస్​ శాసనసభ్యులు బుధవారం కమలదళంలో చేరడం.. భాజపా చేపట్టిన 'ఆపరేషన్​ కీచడ్(బురద)'లో భాగమని దుయ్యబట్టింది.

"భారత్​ జోడో యాత్ర విజయాన్ని చూసి భాజపా కంగారు పడుతోంది. అందుకే గోవాలో ఆపరేషన్​ కీచడ్​ను ముమ్మరం చేసింది. యాత్రను తక్కువ చేసి చూపేందుకు ఇప్పటికే భాజపా అసత్య ప్రచారాలు సాగిస్తోంది. అయినా.. మేము వెనక్కు తగ్గం. భాజపా కుయుక్తులు అన్నింటినీ అధిగమిస్తాం" అని ట్వీట్ చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, పార్టీ కమ్యూనికేషన్స్ విభాగం బాధ్యుడు జైరాం రమేశ్.

జై రాం రమేశ్​ ట్వీట్​​

"భాజపాకు విడగొట్టడం మాత్రమే వచ్చని మరోసారి నిరూపితమైంది. దేశాన్ని ఏకం చేసే ఈ సంక్లిష్టమైన ప్రయాణానికి మద్దతుగా నిలవలేని వారు, భాజపా బెదిరింపులకు భయపడేవారు.. విడగొట్టేవారివైపు వెళ్తున్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని వారు గుర్తుంచుకోవాలి" అని అన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేడా.

గోవాలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 40 స్థానాలకు గానూ భాజపా 20 సీట్లు దక్కించుకుంది. మెజార్టీ మార్కుకు ఒక్క సీటు తగ్గిన నేపథ్యంలో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు వారిలో ఎనిమిది మంది బుధవారం భాజపాలో చేరిపోయారు. మూడింట రెండొంతుల మంది పార్టీని వీడిన నేపథ్యంలో... ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని వీరు తప్పించుకున్నట్లైంది.

'ఆ భూభాగం సంగతేంటి?'
మరోవైపు.. చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. చైనాకు 'ధారాదత్తం' చేసిన భూభాగాన్ని ఎలా తిరిగి రాబడతారో ప్రభుత్వం చెప్పగలదా అని ప్రశ్నించారు. తూర్పు లద్దాఖ్​లో గోగ్రా-హాట్​స్ప్రింగ్స్​ ప్రాంతంలోని పెట్రోలింగ్ పాయింట్ 15 వద్ద బలగాల ఉపసంహరణ పూర్తయినట్లు రెండు దేశాల సైన్యాలు ప్రకటించిన నేపథ్యంలో ఈ విమర్శలు చేశారు రాహుల్.

"సరిహద్దులో 2020 ఏప్రిల్​కు ముందు నాటి స్థితిని పునరుద్ధరించాలన్న భారత్​ డిమాండ్​ను చైనా తిరస్కరించింది. ఏమాత్రం ప్రతిఘటించకుండా చైనాకు వెయ్యి చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ప్రధాని ఇచ్చేశారు. ఆ భూమి మనకు తిరిగి ఎలా తెస్తారో ప్రభుత్వం చెప్పగలదా?" అని ట్వీట్ చేశారు రాహుల్.

'రాజకీయ లబ్ధి కోసం ప్రజల్లో చీలిక'
గత 8 ఏళ్లుగా అతికొద్ది మంది రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల చేతుల్లోనే అధికారం కేంద్రీకృతమైందని ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఇది.. భారత ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థల్ని బలహీనపరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జాతీయ దినపత్రికలో సంపాదకీయం రాశారు సోనియా. ధన బలంతో ఎన్నికల్లో గెలవడం; ప్రత్యర్థులపై కేంద్ర సంస్థల్ని ఉసిగొల్పడం; మైనార్టీలు, ఇతర వర్గాలపై దాడులు సహా మరికొన్ని విషయాలను ప్రస్తావిస్తూ భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు.

ఇదీ చదవండి:పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదని కూలీ ఆగ్రహం- బెంజ్ కారుకు నిప్పు

రూ.200 కోట్ల డ్రగ్స్​తో భారత్​లోకి పాక్ పడవ.. ఆరుగురు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details