ఝార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. నవజాత శిశువు మృతదేహాన్ని జైలుశిక్ష అనుభవిస్తున్న తన భర్తకు కడసారి చూపించేందుకు వెళ్లిన మహిళకు ఆవేదనే మిగిలింది. జైలు ప్రధాన ద్వారం వద్ద 7 గంటలకు పైగా వేచి చూసినప్పటికీ అధికారులు కరుణించలేదు. ఒక్కసారి తన భర్తను కలవడానికి అవకాశం ఇవ్వమని కన్నీరుమున్నీరుగా విలపించినా.. ఒక్క అధికారి కూడా స్పందించలేదు.
అసలేం జరిగిందంటే..?
వశిష్ట్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బందర్చువాన్ గ్రామానికి చెందిన చుమన్ మహ భార్య ఫూల్ దేవి శుక్రవారం రాత్రి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆమె కుటుంబసభ్యులు సంబరపడుతున్న వేళ శనివారం రాత్రి ఉన్నట్టుండి నవజాత శిశువు ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అయితే ఫూల్ దేవిది మారుమూల గ్రామం కావడం వల్ల సరైన రవాణా సౌకర్యం లేక ఆ రాత్రిపూట ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోయారు. రాత్రంతా పిల్లవాడ్ని జాగ్రత్తగా చూసుకుంటూ గడిపారు. ఆదివారం పొద్దున్న.. నవజాత శిశువును ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధరించారు.
అయితే ఫూల్ దేవి భర్త చుమన్ మహ గత ఏడు నెలలుగా ఓ కేసులో నిందితుడిగా జైలు శిక్ష అనభవిస్తున్నాడు. కొడుకు మృతదేహాన్ని భర్తకు కడసారి చూపించేందుకు ఫూల్ దేవి జైలుకు బయలుదేరింది. ఆదివారం ఉదయం 8 గంటలకు జైలు ప్రధాన ద్వారం వద్దకు చేరుకుంది. బిడ్డ మృతదేహం పట్టుకుని రోధిస్తూ తన భర్తను ఒక్కసారి కలవడానికి అవకాశం ఇవ్వాలని అధికారులను కోరింది. అయినా ఒక్కరు కూడా పట్టించుకోలేదు. కనీసం స్పందించలేదు. ఎంత బతిమిలాడినా ఫూల్ దేవిని లోపలకి అనుమతించలేదు. చివరకు చేసేదేమి లేక నవజాత శిశువు అంత్యక్రియలను ఆదివారం మధ్యాహ్నం నిర్వహించారు.