దిల్లీలోని జహంగీర్‌పురిలో మరోమారు అల్లర్లు చెలరేగాయి. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో మూడు వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. సీసీటీవీ రికార్డులను పరిశీలించిన పోలీసులు.. నిందితులు విశాల్, వీరూని అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
రెండు రోజుల క్రితం తమతో గొడవకు దిగారనే కారణంతో ఇద్దరు యువకులను వెతుకుతూ.. ఓ వ్యక్తి అతని స్నేహితులు జహంగీర్పుర్కు వచ్చారు. అప్పటికే వారు మద్యం మత్తులో ఉన్నారు. ఆ సమయంలో ఈ రాళ్ల దాడికి పాల్పడ్డారు. సమీపంలోని మూడు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
" నిందితులు జహంగీర్‌పురికి చెందిన విశాల్, వీరూగా గుర్తించాం. ఈ అల్లర్లలో పాల్గొన్న మిగతావారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటాం. గొడవలో పాల్గొన్నవారు ఒకే వర్గానికి చెందిన వారు కావడం వల్ల గొడవలో ఎలాంటి మతపరమైన కోణం లేదు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. తదుపరి విచారణ జరుగుతోంది.