Vice President oath ceremony: భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. ధన్‌ఖడ్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు ధన్‌ఖడ్.. రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఇటీవల జరిగిన భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన జగదీప్ ధన్‌ఖడ్.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాపై గెలుపొందారు. రాజస్థాన్ ఓబీసీ జాట్ సామాజిక వర్గానికి చెందిన ధన్‌ఖడ్.. మూడు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన సామాజిక, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూనే అత్యున్నత స్థాయికి ఎదిగారు.
ధన్‌ఖడ్ 1951 మే 18న.. రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లా కిథనా గ్రామంలో జన్మించారు. 1 నుంచి 5వ తరగతి వరకు పుట్టిన ఊర్లోనే ప్రభుత్వ బడిలో చదువుకున్నారు. 6వ తరగతి స్వగ్రామానికి 4-5 కిలోమీటర్ల దూరంలోని.. గార్ధానా ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో చదివారు. 1962లో ఛిత్తోడ్‌గఢ్ సైనిక్ స్కూల్‌కు ఎంపికై, మెరిట్ స్కాలర్‌షిప్‌పై మళ్లీ ఐదో తరగతిలో చేరారు. జైపుర్‌లోని మహారాజా కాలేజీలో ఫిజిక్స్‌లో బీఎస్సీ చేశారు. 1978-79లో రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ కోర్సు పూర్తిచేశారు. 1979 నవంబర్ 10న రాజస్థాన్ బార్ అసోసియేషన్‌లో అడ్వకేట్‌గా పేరు నమోదు చేసుకొని న్యాయవాదిగా సేవలందించారు. 1990 మార్చి 27న రాజస్థాన్ హైకోర్టు ద్వారా సీనియర్ అడ్వకేట్ హోదా పొందారు. 1990 నుంచి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఉక్కు, బొగ్గు, గనులు, అంతర్జాతీయ వాణిజ్య మధ్యవర్తిత్వ రంగాలపై జగదీప్ ధన్‌ఖడ్‌కు పట్టు ఉంది. వివిధ హైకోర్టుల్లోనూ వాదనలు వినిపించారు.