Jagan Onion and Potato Comments in Tirupati Sabha:సీఎం జగన్ స్పీచ్ అంటే చాలు చాలా మంది జుట్టు పీక్కుంటారు. ఏం మాట్లాడతారా అందులో ఏం అర్ధం వస్తుందా అని. ఇక బహిరంగ సభల్లో అయితే జగన్ ప్రజలను చూసి మాట్లాడే దాని కంటే పేపర్‌ను చూసి మాట్లాడటమే ఎక్కువ ఉంటుంది. అందులోనూ అక్కడ ఉన్న పదాలు చదవకుండా కొత్త పదాలు వాడుతుంటారనే ప్రచారం జరుగుతోంది. మీటింగ్స్‌లో జగన్ స్పీచ్ అంటే అందరి కంటే ముందు కంగారుపడేది వైసీపీ శ్రేణులు, కార్యకర్తలే. ఏ పదాన్ని ఏం అంటారోనని, ఏ పదాన్ని ఎలా పలుకుతారోనని టెన్షన్ పడుతుంటారు. జగన్ మాట్లాడే దానికి సామాజిక మాధ్యమాల్లో జనాలు ఏ రేంజ్లో ట్రోల్స్ చేస్తారా అని భయపడుతూ ఉంటారు. గతంలోనూ ఎన్నో సభల్లోనూ, ప్రెస్మీట్ల్లోనూ జగన్ మాట్లాడే స్పీచ్‌లో అనేక సార్లు తప్పులు దొర్లి ఈ విధంగా జరిగాయి. తాజాగా మరోసారి అదేవిధంగా సీఎం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి.
ఆంధ్రావని జీవనాడిపై జగన్ అలసత్వం - రివర్స్‌గేర్‌లో పోలవరం పనులు
ఇటీవల సంభవించిన మిగ్జాం తుపాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ తుపాన్ వల్ల రైతులు భారీగా నష్టపోయారు. చేతికి వచ్చిన పంట సర్వనాశనం అయిందని గగ్గోలు పెడుతూ ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తిరుపతి జిల్లాలో పర్యటించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడుతూ బాధితులకు అందిస్తున్న కూరగాయల గురించి మాట్లాడుతూ కేజీ ఆనియన్, కేజి ఉల్లిగడ్డ అని జగన్ పలికారు. పక్కన ఉన్నవారు కాదు అని చెప్పగా 'పొటాటోని ఉల్లిగడ్డే' అంటారుగా అంటూ అధికారులను ప్రశ్నించారు. సీఎంకు పోటాటోని తెలుగులో ఏమంటారో తెలియకపోవడంతో అక్కడికి వచ్చిన జనం బంగాళదుంప అంటారని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. చివరిగా పక్కనే ఉన్న అధికారులను పొటాటోను ఏమంటారో అడిగి బంగాళ దుంప అని స్పీచ్‌లో చెప్పారు. దీంతో ఆలుగడ్డకు, ఉల్లిగడ్డకు తేడా తెలియని సీఎం రాష్ట్రానికి పట్టిన దరిద్రం అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ ప్రారంభమయ్యాయి.
Jagan Funny Comments in Past:ఇది మాత్రమే కాదు గతంలో కూడా 'మిలాఖాతుల్లో ములాఖాతులై' అంటూ ఓ సారి 'కాస్తో ఇస్కిస్తో అంటూ మరో సారి నవ్వులపాలయ్యారు. ప్రస్తుతం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ మీమ్స్ రూపంలో హల్చల్ అవుతున్నాయి. ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా లేదా అని ప్రశ్నిస్తున్నారు. జగన్‌కు పాలన చేతకాదు, మాట్లాడటం అంతకన్నా రాదని మరికొందరు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. మాకు ఏంటి ఈ కర్మ అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.