World Most Expensive Mango Jabalpur: భానుడి ప్రతాపానికి మనుషులే కాదు.. పంటలూ నాశనం అవుతున్నాయి. చెట్టు నిండా కాయలతో నిగనిగలాడాల్సిన మామిడి తోటలు.. పూత, కాత లేకుండా రైతుల్ని వెక్కిరిస్తున్నాయి. మధ్యప్రదేశ్ జబల్పుర్లో సంకల్ప్ సింగ్ పరిహార్ అనే రైతు పరిస్థితి మరీ దారుణం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు సహా ఎన్నో రకాలను సాగు చేస్తున్న ఆయన్ను.. ఈ ఎండాకాలం పెద్ద దెబ్బ కొట్టింది. పంట నిర్వహణకు లక్షలు ఖర్చు పెట్టినా.. ఫలితం దక్కలేదు. 12 విదేశీ జాతి శునకాలు, 3 దేశీయ శునకాలు సహా నలుగురు సిబ్బందిని తోటకు కాపలాగా పెట్టి పంటను కాపాడుకుంటూ వచ్చిన సంకల్ప్.. ఎండ నుంచి తప్పించుకోలేకపోయారు. కిలో రూ. 2.70 లక్షలు పలికే మియాజాకి రకం పండ్లను కూడా సాగుచేశారు సంకల్ప్.
ఎండకు తాళలేక చెడిపోతున్న మామిడి పసుపురంగులోకి మారకముందే రాలిపోతున్న కాయలు జబల్పుర్లో రోజువారీగా ఉష్ణోగ్రతలు సగటున 43 డిగ్రీల సెల్సియస్పైనే నమోదవుతున్నాయి. దీంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పూత పూసి.. పిందెలు వేసి.. ఆశలు రేకెత్తించిన మామిడి.. చేతికొచ్చే సమయానికి నేలరాలుతుండటం వల్ల.. రైతులు దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఎండల కారణంగా పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం కనిపిస్తోందని అన్నారు సంకల్ప్ సింగ్. 50 శాతానికిపైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పక్వానికి రాకముందే కాయలు రాలుతున్నాయని, పండ్ల పరిమాణం కూడా చాలా చిన్నదిగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల్లో పెట్టుబడి పెట్టినా.. ఫలితం లేకపోయిందని చెప్పుకొచ్చారు.
మామిడి తోటకు విదేశీ కుక్కలతో పహారా కుక్కలను కాపలాగా ఉంచి పంటను కాపాడుకుంటూ వచ్చిన సంకల్ప్ సింగ్ ''ఈసారి మామిడి పంటపై ఎండలు తీవ్ర ప్రభావం చూపాయి. ఏప్రిల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల మామిడి చెట్లు ఎండిపోవడం మొదలైంది. పండ్ల పరిమాణం కూడా చాలా చిన్నదిగా మారింది. పక్వానికి రాకముందే.. పండ్లు పసుపు రంగులోకి మారడం ప్రారంభించాయి. మామిడిపంటను కాపాడేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినా ఎండ దెబ్బకు ఏమీ మిగల్లేదు. ఈసారి మామిడి ఉత్పత్తిలో 50 శాతం దిగుబడి తగ్గేలా ఉంది.''
- సంకల్ప్ సింగ్ పరిహార్, రైతు
దేశంలో మరెక్కడా కనిపించని మామిడి రకాలు.. మధ్యప్రదేశ్ జబల్పుర్లో కనిపిస్తాయి. నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో నానాఖేదా ప్రాంతంలో శ్రీ మహాకాళేశ్వర్ హైబ్రిడ్ ఫాం హౌస్లో.. కొంతకాలంగా భారీ వ్యయంతో భిన్న రకాల మామిడిని సాగు చేస్తున్నారు సంకల్ప్ సింగ్ పరిహార్. జంబో గ్రీన్ మ్యాంగోగా పిలిచే 'తలాల గిర్ కేసర్' సహా నేపాల్ రకం కేసర్ బాదం మ్యాంగో, చైనాకు చెందిన ఐవరీ మ్యాంగో, అమెరికా ఫ్లోరిడాలో పండించే మాంగిఫెరా టామీ ఆట్కిన్స్ రకాల మామిడిపండ్లను ఇక్కడ పండిస్తారు. అత్యంత ఖరీదైన రకాల్లో ఒకటైన ఈ ఫ్లోరిడా మ్యాంగోను 'బ్లాక్ మ్యాంగో' అని కూడా పిలుస్తుంటారు. ఇక ఈ తోటలోనే కాదు దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రత్యేక మామిడి రకం మియాజాకి. జపనీస్ ఎగ్ప్లాంట్ అని కూడా పిలిచే ఈ రకం మామిడి పండ్ల ధర కిలో ఏకంగా రూ.2.70లక్షలు. ఇలా మొత్తం 8 విదేశాలకు చెందిన మామిడి రకాలు సహా భారత్కు చెందిన 20 రకాలను సంకల్ప్ పరిహార్ సాగు చేస్తున్నారు. అంత విలువైనవి కాబట్టే తోటకు భారీ వ్యయంతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తోటను సందర్శిస్తున్న మహిళలు Jabalpur Mangoes: ఆ మామిడి తోటలోకి వెళ్లిన వారు కనీసం సెల్ఫీలు కూడా తీసుకోవడానికి వీల్లేదు. కాయలను ముట్టుకోకూడదు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన మామిడి రకాలను పండిస్తున్న ఈ తోటకు పహారా కాసేందుకు 12 విదేశీ జాతుల శునకాలు సహా మూడు దేశీయ జాతుల శునకాలను మోహరించారు యాజమాని. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు మామిడి కాయలు చోరీకి గురికాకుండా ఉండేందుకు నలుగురు సిబ్బంది 24 గంటలపాటు డేగ కళ్లతో చూస్తుంటారు. మియాజాకి మామిడి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రకం అంటున్నారు సంకల్ప్. జపాన్లోని మియాజాకి రాష్ట్రంలో పండే ఈ రకానికి ఆ ప్రాంతం వల్లే ఈ పేరు వచ్చినట్లు చెప్పారు. భారత్లోని ఇతర ప్రాంతాల్లో కూడా రైతులు వీటిని సాగు చేస్తున్నట్లు తెలిపారు. బ్లాక్ మ్యాంగో ఎంతో ఆరోగ్యకరమని, మధుమేహం ఉన్నవారు కూడా వీటిని తినవచ్చని వివరించారు. వీటిలో గ్లూకోస్, చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయని, అందువల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవని పేర్కొన్నారు. అత్యంత అరుదైన ఈ మామిడి పండ్లు బయట నుంచి పర్పుల్ కలర్లో, లోపల ఎరుపు రంగులో ఉంటాయి.
Mango Varieties Jabalpur: ఈ తోటలో పండే చైనా ఐవరీ మామిడి పండ్లు ఒక్కో కాయ 2-3 కిలోలు ఉంటుంది. కొన్ని సార్లు నాలుగు కేజీల కాయలు కూడా కాస్తాయి. వీటి పొడవు ఒకటిన్నర అడుగుల వరకు ఉంటుంది. ఈ తోటలోని మామిడి చెట్లకు జనవరిలో పూత పూయడం మొదలవుతుంది. జూన్ చివరినాటికి కాయలు పక్వానికి వస్తాయి. ఈ మామిడి పండ్ల గింజలే 100-250 గ్రాముల బరువు ఉంటాయని సంకల్ప్ చెప్పారు.
ఇవీ చూడండి:నోరూరించే 'నూర్జహాన్' మామిడి.. ధర తెలిస్తే షాకే!
మామిడి రైతులకు తప్పని నిరాశ.. ఫలరాజుకు మళ్లీ దక్కని గిట్టుబాటు ధర..
7 మామిడి పండ్లు.. ఆరుగురు బాడీగార్డ్స్.. 9 శునకాలు