ముద్దుముద్దు మాటలు చెప్తూ, చలాకీగా ఉండాల్సిన ఆ చిన్నారి కొద్దిరోజులుగా నిశ్శబ్దంగా ఉన్నాడు. రోజురోజుకూ బలహీనమవుతున్నాడు. ఉద్యోగాల్లో బిజీగా ఉండే ఆ తల్లిదండ్రులకు తమ రెండేళ్ల కొడుకు ప్రవర్తనలో అకస్మాత్తుగా వచ్చిన మార్పు ఆందోళన కలిగించింది. ఇంట్లో అన్నీ అందుబాటులో ఉన్నా ఎందుకిలా జరుగుతుందని కంగారుపడ్డారు. వెంటనే వైద్యుడిని సంప్రదించగా.. ఆయన చెప్పిన విషయాలు వారిని షాక్‌కు గురిచేశాయి.
అసలేం జరిగిందంటే?.. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌కు చెందిన దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇరువురు ఉద్యోగాలు చేస్తుండడం వల్ల రోజు మొత్తం బాబును చూసుకోవడానికి ఒక మహిళను నియమించారు. ఆమెకు రూ.5,000 చెల్లిస్తూ, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇక పిల్లాడిని ఆమెకు అప్పగించి వారు ఉద్యోగాల్లో నిమగ్నమయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకు పిల్లాడిలో మార్పు రావడం మొదలైంది. అల్లరి మాట పక్కనపెడితే, పూర్తి నిశ్శబ్దంగా మారిపోయాడు. తిండి మీద ఆసక్తి తగ్గిపోయింది. ఈ తీరు వారిని తీవ్రంగా కలవరపెట్టింది. వెంటనే బాలుడిని తీసుకొని ఆసుపత్రికి వెళ్లగా.. వైద్యుడు చెప్పిన విషయాలకు వారి గుండె ఆగినంతపనైంది.