Jabalpur collector: నెలలు గడిచినా ప్రజా ఫిర్యాదులను పరిష్కరించలేకపోయినందుకు తనకు డిసెంబర్ నెలకు వచ్చే జీతాన్ని నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు మధ్యప్రదేశ్ జబల్పుర్ జిల్లా కలెక్టర్ కరంవీర్ శర్మ. 100 రోజులు దాటినా సీఎం హెల్ప్‌లైన్‌కు అందిన ఫిర్యాదులు ఇంకా అలానే ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. తనతో పాటు ఇతర అధికారుల వేతనాలను కూడా ఆపాలని జిల్లా కోశాధికారికి సూచించారు.
కలెక్టర్ కరంవీర్ శర్మ సోమవారం.. శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలో సీఎం హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఫిర్యాదులు 100 రోజులు దాటినా పెండింగ్‌లోనే ఉన్నాయని ఆయన దృష్టికి వచ్చింది. దీంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సున్నితంగా వ్యవహరించాలని, ఫిర్యాదు అందగానే నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలని తేల్చి చెప్పారు. ఒక్క ఫిర్యాదును కూడా వదిలివేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించనందుకు ఇతర అధికారులతో పాటు స్వచ్ఛత, హెల్ప్‌లైన్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ల జీతాలను కూడా నిలిపివేయాలని జిల్లా కోశాధికారిని కలెక్టర్ ఆదేశించారు.
Collector salary pending