జమ్ముకశ్మీర్‌కు గతేడాది స్వయంప్రతిపత్తి తొలగించి.. కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన అనంతరం తొలిసారిగా అక్కడ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జమ్ముకశ్మీర్ పంచాయతీరాజ్ చట్టంలోని 73వ సవరణను అమలు చేసేందుకు కేంద్రం సన్నద్ధమైంది. అందులో భాగంగా నిర్వహించనున్న 8 దశల ఎన్నికల్లో.. శనివారం (నవంబర్ 28)న తొలి దశలో 43 డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్(డీడీసీ)లు, సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ.. ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొదటి దశలో డీడీసీ, సర్పంచ్, ఉప ఎన్నికల్లో మొత్తం 1427 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
తొలి దశలో మొత్తం 43 డీడీసీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. వీటిలో 25 కశ్మీర్లో ఉండగా.. 18 జమ్ములో ఉన్నాయి. డీడీసీ ఎన్నికల్లో మొత్తం 296 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అందులో 207 మంది పురుషులు, 89 మంది మహిళలు ఉన్నారు. 94 నియోజకవర్గాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనుండగా.. 279 మంది బరిలో ఉన్నారు. అలాగే.. 368 నియోజకవర్గాల్లో జరుగుతోన్న సర్పంచ్ ఉప ఎన్నికల్లో 852 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. మొత్తం 2,146 పోలింగ్ కేంద్రాల్లో.. కట్టుదిట్టమైన భద్రత నడుమ 7,03,620 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో కశ్మీర్ డివిజన్లో 3.72 లక్షలు, జమ్ము డివిజన్లో 3.28 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
ముష్కర ముప్పు..