జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లాలోని కర్నా ప్రాంతంలో ఉగ్రవాద ముఠాకు చెందిన వ్యక్తి నుంచి తొమ్మిది కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.60 కోట్లు ఉంటుందని తెలిపారు. ముర్తార్ హుస్సేన్ షా అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు.. ముఠాలో మరికొందరు పరారీలో ఉన్నారని తెలిపారు. వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని వివరించారు.
తమకొచ్చిన పక్కా సమాచారం మేరకు దాడి చేసి నార్కో-టెర్రర్ మూలాలను ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పాకిస్థాన్ అండతో జమ్ములో ఉగ్ర కార్యకలాపాలకు సహకరిస్తోన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు ప్రతినిధి ఒకరు వివరించారు.